మహారాష్ట్ర లోని సతారా జిల్లా కోరెగావ్ లో ఈవీఎంలో ఉన్న ఏ గుర్తు పై నొక్కినా ఓటు అధికార పార్టీ గుర్తు కమలానికే పడుతోందని, ఆ విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా దాన్ని ధ్రువీకరించారని ఫేస్బుక్ లో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో కనుక్కుందాం.

క్లెయిమ్: మహారాష్ట్ర లోని సతారా జిల్లా లో ఈవీఎం టాంపరింగ్ జరిగినట్లుగా ఎన్నికల అధికారులు అంగీకరించారు.
ఫాక్ట్ (నిజం): మహారాష్ట్ర ఎన్నికల్లో సతారా జిల్లాలో ఈవీఎం టాంపరింగ్ జరిగినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి గూగుల్ లో ‘evm tampering satara district maharashtra elections’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. వాటిలో ‘The New Indian Express’ వారి కథనం చదివినప్పుడు, సతారా జిల్లా కోరేగావ్ నియోజకవర్గంలోని నేవేల్వాడి గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఈవీఎంలో ఉన్న ఏ గుర్తు పై నొక్కినా ఓటు అధికార పార్టీ గుర్తు కమలానికే పడుతోందని ఆరోపించారనీ, ఆ విషయం గురించి అడగగా ఎన్నికల అధికారులు పొరపాటు జరిగిందని తనతో అన్నారని NCP లీడర్ శశికాంత్ షిండే చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ, కోరేగావ్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కీర్తి నలవాడే మాట్లాడుతూ ఆ ఘటన గురించి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపినట్లుగా కూడా ఆ కథనంలో ఉంటుంది.

ఆ ఘటన పై ECI అడిషనల్ సిఈవో కూడా స్పందిస్తూ, ఆలా వస్తున్న టాంపరింగ్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పినట్టు ‘NDTV’ వారి న్యూస్ వీడియో ద్వారా తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ అధికారిక ప్రతినిధి షెఫాలీ శరన్ కూడా సతారా జిల్లాలో ఎన్నికల టాంపరింగ్ కి సంబంధించి వస్తున్న ఆరోపణల గురించి అక్కడి DEO అలాంటిది ఏమీ లేదని స్పష్టత ఇచ్చినట్లుగా ఒక ట్వీట్ ద్వారా తెలిపింది.
చివరగా, మహారాష్ట్ర లోని సతారా జిల్లా లో ఈవీఎం టాంపరింగ్ జరిగినట్లుగా ఎన్నికల అధికారులు అంగీకరించలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?