భారతదేశ దేశభక్తి పాటను అమెరికన్ టాలెంట్ షోలో డాన్స్ చేసారని ఒక వీడియో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమెరికన్ టాలెంట్ షోలో భారతదేశ దేశభక్తి పాటకు డాన్స్ చేసిన వీడియో.
ఫాక్ట్: గాట్ టాలెంట్ గ్లోబల్ అనే యుట్యూబ్ ఛానల్ యొక్క వీడియోను క్రాప్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేసారు. విక్కీ పరేఖ్ పాడిన జై హో ఇండియా అనే పాటను యుట్యూబ్ వీడియోకి జోడించి అమెరికన్ టాలెంట్ షోలో దేశభక్తి పాటపై డాన్స్ చేస్తున్నట్టుగా వీడియోను ఎడిట్ చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక యుట్యూబ్ వీడియో లభించింది. 0.39 టైం స్టాంప్ నుండి గనక ఈ వీడియోను చూసినట్లయితే పోస్ట్‌లోని వీడియో కూడా ఇక్కడినుంచే మొదలవుతున్నట్టు చూడొచ్చు. 3.13 టైం స్టాంప్ దెగ్గర వీడియోను ఎండ్ చేస్తే మొత్తంగా పోస్ట్‌లోని వీడియోనే ఇక్కడ నుండి తీసినట్టు తెలుస్తుంది. కానీ యుట్యూబ్‌లో దీని ఆడియో వేరుగా ఉన్నట్టు చూడొచ్చు. ఈ వీడియో కింద వివరణలో టైరా బ్యాంక్స్ నుండి గోల్డెన్ బజర్ పొందిన డాన్స్ క్రూ జుర్కరోహ్ అని ఉంది. ఇక్కడి నుంచి క్లూ తీసుకొని జుర్కరోహ్ గురించి వెతకగా వారి ఫేస్బుక్ అకౌంట్‌లో కూడా దీనికి సంబంధించిన పూర్తి వీడియో లభించింది. ఆ వీడియోలో కూడా భారతదేశ దేశభక్తి పాట ఉన్నట్టుగా లేదు. ఆక్రోబాటిక్ గ్రూప్ జుర్కరోహ్ను 2009లో బ్రెజిలియన్ పీటర్సన్ డా క్రజ్ హోరా స్థాపించారని తెలుస్తుంది.
పోస్టులోని వీడియోలోని పాట గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఈ పాట విక్కీ పరేఖ్ పాడిన జై హో ఇండియా అనే పాట అని తెలుస్తుంది. ఈ పాటను యుట్యూబ్ వీడియోకి జత చేసి అమెరికన్ టాలెంట్ షోలో దేశభక్తి పాటపై డాన్స్ చేస్తున్నట్టుగా వీడియోను ఎడిట్ చేసారు.
చివరగా, ఎడిట్ చేసిన వీడియోను చూపించి అమెరికన్ టాలెంట్ షోలో భారతదేశ దేశభక్తి పాటపై డాన్స్ చేసారని తప్పుగా షేర్ చేస్తున్నారు.