Fake News, Telugu
 

ముస్లిం టోపీని ధరించడానికి నిరాకరించిన జగన్ అంటూ ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

‘ముస్లిం టోపీని తన తలమీద పెట్టొద్దన్న జగన్’  అంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఒక ముస్లిం వ్యక్తి టోపీ పెడుతుండగా జగన్ తనని వారిస్తుండడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం టోపీ తలపై పెట్టొద్దంటూ వారిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): విజయవాడలో ముస్లింల కోసం ఫంక్షన్ హాల్‌ను శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదట టోపీని ధరించడానికి నిరాకరించినప్పటికీ, తర్వాత ఒక క్షణం పాటు టోపీని ధరించి ఆ తర్వాత తీసేసాడు. ఐతే జగన్ టోపీని ధరించిన దృశ్యాలను డిజిటల్‌గా తీసేసి మిగతా దృశ్యాలను మాత్రమే షేర్ చేస్తున్నారు. ఇకపోతే అదేరోజు జరిగిన ముస్లిం ప్రార్ధనలు మరియు ఇఫ్తార్‌లో జగన్ టోపీ ధరించి పాల్గొన్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ దృశ్యాలు ఇటీవల 27 ఏప్రిల్ 2022న విజయవాడలోని వించిపేటలో ‘షా జహూర్ ముసాఫిర్ ఖానా’ ఫంక్షన్ హాల్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో తీసినవి. ఐతే వైరల్ వీడియోలో చూపిస్తున్నట్టు జగన్ మొదట టోపీని ధరనించడానికి నిరాకరించినప్పటికీ తర్వాత ఒక క్షణం పాటు టోపీని ధరించి ఆ తర్వాత తీసేసాడు.

వైరల్ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో వెతకగా, జగన్ విజయవాడలో ఫంక్షన్ హాల్‌ శంకుస్థాపన చేసిన వార్తను రిపోర్ట్ చేసిన వీడియో కథనాలు కనిపించాయి. ఈ వీడియో కథనాలలో జగన్ మొదట టోపీని ధరించడానికి నిరాకరించినప్పటికీ తర్వాత ఒక క్షణం పాటు టోపీని ధరించి ఆ తర్వాత తీసేసిన దృశ్యాలు స్పష్టంగా చూడొచ్చు.

దీన్నిబట్టి జగన్ టోపీ ధరించిన భాగాన్ని డిజిటల్‌గా ఎడిట్ చేసి తీసేసి మిగతా దృశ్యాలను మాత్రమే  షేర్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. పైగా అదే రోజు జగన్ ముస్లిం ప్రార్ధనలలో మరియు ఇఫ్తార్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టులలో (ఇక్కడ మరియు ఇక్కడ) జగన్ టోపీ ధరించి నమాజ్ చేసిన మరియు ఇఫ్తార్‌లో పాల్గొన్న దృశ్యాలు చూడొచ్చు.

చివరగా, ముస్లిం టోపీని ధరించడానికి నిరాకరించిన జగన్ అంటూ ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll