Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని చంద్రయాన్-3 చంద్రుడిపై హిందూ దేవాలయాన్ని కనుగొన్న చిత్రమంటూ షేర్ చేస్తున్నారు

0

చంద్రుడిపై నిర్మించబడి ఉన్న హిందూ దేవాలయాన్ని చంద్రయాన్-3 కనుగొని ఆ దేవాలయం ఫోటోని విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చంద్రుడిపై నిర్మించబడి ఉన్న హిందూ దేవాలయాన్ని ఫోటో తీసి చంద్రయాన్-3 పంపింది.  

ఫాక్ట్ (నిజం): చంద్రుడిపైకి చంద్రయాన్-3 ఇంకా చేరుకోలేదు. 23 ఆగస్టు 2023 నాడు సాయంకాలం 5:47 pmకి చంద్రయాన్-3ని చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసేలా ప్రణాళికా చేసినట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మీడియాకి తెలిపారు. ‘అపోలో 11’ మిషన్‌లో భాగంగా నాసా తీసిన చంద్రుడి చిత్రాన్ని ఎడిట్ చేసి ఈ ఫోటోని రూపొందించారు. చంద్రుడిపై హిందూ దేవాలయాన్ని గుర్తించినట్టు ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ఇదే క్లెయింతో గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చంద్రయాన్-3ని 14 జులై 2023 నాడు లాంచ్ చేసింది. అంటే, పోస్టులో షేర్ చేసిన ఫోటో చంద్రయాన్-3 రాకెట్ లాంచ్ కన్నా ముందు నుంచే సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు స్పష్టమయ్యింది. అంతేకాదు, పోస్టులో షేర్ చేసిన ఫోటోలో చంద్రుడిపై వ్యోమగామి నిలిచునట్టు కనిపిస్తుంది. కానీ, ఇస్రో లాంచ్ చేసిన చంద్రయాన్-3లో మనుషులను అంతరిక్షంలోకి పంపలేదు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోకి సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇదే చిత్రంతో పోలి ఉన్న ఫోటోని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) తమ వెబ్సైటులో మరియు సోషల్ మీడియా పేజీలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

1969లో చంద్రుడిపై ప్రయోగించిన ‘అపోలో 11’ తీసిన చిత్రమని నాసా తమ వెబ్సైటులో తెలిపింది. అపోలో 11 కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లూనార్ మాడ్యూల్‌లోని పరికరాల నిల్వ ప్రాంతంలో పనిచేస్తుండగా తీసిన చిత్రమని నాసా తెలిపింది. నాసా పబ్లిష్ చేసిన అసలు ఫోటోలో హిందూ దేవాలయమేది కనిపించడం లేదు.

చంద్రుడిపై అన్వేషణ కోసం ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3ని ఇస్రో 14 జులై 2023 నాడు విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రయోగించింది. భూమి చుట్టూ 24 రోజులపాటూ  తిరిగి, క్రమంగా తన కక్ష్యను పెంచుకుంటూ, చివరకు చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియకు 40 రోజులు పడుతుందని, 23 ఆగస్టు 2023 నాడు సాయంకాలం 5:47 pmకి చంద్రయాన్-3ని చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసేలా ప్రణాళికా చేసినట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మీడియాకి తెలిపారు. చంద్రుడిపైకి చంద్రయాన్-3 ఇంకా చేరుకోనప్పుడు అక్కడ హిందూ దేవాలయాన్ని చంద్రయాన్-3 కనుగొందని చేస్తున్న వాదనలో అర్ధం లేదు. చంద్రుడిపై హిందూ దేవాలయాన్ని గుర్తించినట్టు ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చంద్రయాన్-3 చంద్రుడిపై హిందూ దేవాలయాన్ని కనుగొన్న చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll