కర్ణాటక కాంగ్రెస్ లీడర్ డీ.కే. శివకుమార్ కూతురు 10 వ తరగతి చదువుతుందని, తన పేరు మీద 1010 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు లో బయటపడింది అంటూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : 10వ తరగతి చదువుతున్న డీ.కే. శివకుమార్ కూతురు ఆస్తి విలువ 1010 కోట్లు అని ఈడీ దర్యాప్తు లో తెలిసింది.
ఫాక్ట్ (నిజం): తమ దర్యాప్తు లో డీ.కే. శివకుమార్ కూతురు ఐశ్వర్య ఆస్తి విలువ 1010 కోట్లు అని బయటపడినట్టు ఈడీ ఎక్కడ కూడా వెల్లడించలేదు. తన కూతురు ఐశ్వర్య ఆస్తి 108 కోట్లు అని డీ.కే. శివకుమార్ తన 2018 ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించాడు. అంతేకాదు, తన కూతురు ఒక మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
శివకుమార్ కి ఇద్దరు కూతుర్లు (ఐశ్వర్య, ఆభరణ) మరియు ఒక్క కొడుకు (ఆకాష్). పోస్ట్ లోని కామెంట్స్ మరియు ఇతర పోస్టులు చూస్తే పోస్ట్ చేసింది ఐశ్వర్య గురించి అని తెలుస్తుంది.
పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, డీ.కే. శివకుమార్ కూతురు ఐశ్వర్య ఆస్తి విలువ 1010 కోట్లు అని తమ దర్యాప్తు లో తేలిందని ఈడీ వెల్లడించినట్టు ఎక్కడా కూడా దొరకలేదు. దర్యాప్తు లో భాగంగా తమ ముందు హాజరు కావాలని డీ.కే. శివకుమార్ కూతురు ఐశ్వర్య కి ఈడీ సమన్లు పంపించినట్టుగా ‘The Times of India’ ఆర్టికల్ లో చదవచ్చు. అలానే, డీ.కే. శివకుమార్ తన కూతురి (ఐశ్వర్య) ఆస్తి విలువ 108 కోట్లు అని తన 2018 ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించినట్టు ఆ ఆర్టికల్ లో ఉంటుంది (మరో కూతురి ఆస్తి కూడా అఫిడవిట్ లో చూడవచ్చు). 2018 కర్ణాటక ఎన్నికలలో కనకపుర నియోజికవర్గంలో పోటీ చేసినప్పుడు డీ.కే. శివకుమార్ ఇచ్చిన అఫిడవిట్ ఇక్కడ చూడవచ్చు.
అంతేకాదు, తన కూతురు ఐశ్వర్య 10వ తరగతి చదవట్లేదు, తను ఒక మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్. డీ.కే. శివకుమార్ పెట్టిన ‘Global Academy of Technology’ లో తను ట్రస్టీ కూడా.
చివరగా, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ అయిన డీ.కే. శివకుమార్ కూతురు ఐశ్వర్య ఆస్తి విలువ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం 108 కోట్లు; 1010 కోట్లు అని ఈడీ వెల్లడించలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?