Fake News, Telugu
 

“డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియో ఫైల్‌తో సైబర్ దాడి జరిగినట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు; ఈ ప్రచారం చాలా సంవత్సరాలుగా ఉంది

0

భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల (ఇక్కడఇక్కడ, & ఇక్కడ) నేపథ్యంలో, “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే మాల్వేర్ వైరస్‌తో కూడిన వీడియోతో పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ దాడి చేస్తుంది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). పాకిస్తాన్ సైబర్ దాడుల కారణంగా దేశవ్యాప్తంగా ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని పేర్కొంటూ మరొక పోస్టు కూడా వైరల్ అవుతుంది, ఈ పోస్టులో కూడా ‘Tasksche.exe’ అనే ఫైల్ & ‘Dance of Hillary’ అనే వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని వీటిలో మాల్వేర్ వైరస్‌ ఉందని, వీటిని క్లిక్ చేయడం ద్వారా సైబర్ దాడికి గురి అవుతారని పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే మాల్వేర్ వైరస్‌తో కూడిన వీడియోతో పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ దాడి చేస్తుంది, దాడి కారణంగా భారతదేశంలో ATMలు 2-3 రోజులు మూసివేయబడునున్నాయి.

ఫాక్ట్(నిజం): “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందనే వార్త చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది; ఇది కనీసం 2015 నుండి ప్రచారంలో ఉంది. “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే పేరుతో ఉన్న వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురినైట్లు ఈ కథనం రాసే సమయానికి ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. ఇది కేవలం పుకారు అని పేర్కొంటూ పలు ఫాక్ట్-చెకింగ్ సంస్థలు గతంలో కథనాలను ప్రచురించాయి, 2024లో ఇదే “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ లో వార్త వైరల్ కాగా, ఇది నిజం కాదని, కేవలం పుకారు మాత్రమే అని పాకిస్తానీ ఫాక్ట్-చెకింగ్ సంస్థ ‘soch’ ఫాక్ట్-చెక్ కథనం ప్రచురించింది. అలాగే 2017లో, మలేషియా ప్రభుత్వానికి చెందిన మలేషియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని స్పష్టం చేసింది. అయితే, ఏవైనా అనుమానాస్పద వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఏమైనా ఫైల్స్, లింకులు ఓపెన్ చేయడం వల్లన సైబర్ దాడికి గురి అయ్యే ప్రమాదం ఉంది. 08 మే 2025న, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫాక్ట్-చెక్ విభాగం X (ట్విట్టర్)లో పాకిస్తాన్ చేసిన సైబర్ దాడి కారణంగా భారతదేశం అంతటా ATMలు 2–3 రోజులు మూసివేయబడతాయని అనే వార్త నిజం కాదని  స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

“డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే మాల్వేర్ వైరస్‌తో కూడిన వీడియోతో పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ దాడి చేస్తుంది అని భారత ప్రభుత్వం ఏమైనా హెచ్చరికలను జారీ చేసిందా అని తెలుసుకోవడానికి, ముందుగా మేము సైబర్ దాడులు, మాల్వేర్ వైరస్‌ల గురించి సమాచారం అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యొక్క అధికారిక వెబ్‌సైట్‌లను, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాము. అయితే, ఈ రెండు వెబ్‌సైట్‌లలోనూ వైరల్ క్లెయిమ్‌ను సమర్థించే ఎటువంటి సమచారం లభించలేదు.

తదుపరి మేము CERT-In సంస్థ ఆధ్వర్యంలో నడిచే సైబర్ స్వచ్ఛత కేంద్ర (బోట్‌నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్ సెంటర్) వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించాము. అయితే, ఈ వెబ్‌సైట్‌లో కూడా  వైరల్ క్లెయిమ్‌ను సమర్థించే ఎటువంటి సమచారం లభించలేదు. చివరిగా, అక్టోబర్ 2024లో రాన్సమ్‌వేర్ వైరస్ ‘రాన్సమ్‌హబ్’ గురించి హెచ్చరిక జారీ చేయబడింది. ఈ సంస్థ హానికరమైన సాఫ్ట్‌వేర్‌లను గుర్తించడంలో సహాయపడుతుంది, అలాగే మాల్వేర్ వైరస్‌లను తొలగించడానికి ఉచిత సాధనాలను అందిస్తుంది. అలాగే సైబర్ భద్రతకు, సైబర్ దాడులకు గురి కాకుండా ఉండటానికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులను సిఫార్సు చేస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా మాల్వేర్ వైరస్‌లకు సంబంధించి హెచ్చరికలను జారీ చేస్తుంది.

ఇకపోతే “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందనే వాదన చాలా ఏళ్ళుగా ప్రచారంలో ఉంది. ఇది కనీసం 2015 నుండి ప్రచారంలో ఉంది. ఇదే క్లెయిమ్ ఇంతకు ముందు ‘Dance of the Pope’. ‘Sonia Disowns Rahul’ అనే పేర్లతో వైరల్ అయింది. ఇది కేవలం పుకారు అని పేర్కొంటూ పలు ఫాక్ట్-చెకింగ్ సంస్థలు, వార్త సంస్థలు గతంలో కథనాలను ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే 2017లో, మలేషియా ప్రభుత్వానికి చెందిన మలేషియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని స్పష్టం చేసింది.

2024లో ఇదే “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ లో వార్త వైరల్ కాగా, ఇది నిజం కాదని, కేవలం పుకారు మాత్రమే అని పాకిస్తానీ ఫాక్ట్-చెకింగ్ సంస్థ ‘soch’ ఫాక్ట్-చెక్ కథనం ప్రచురించింది.

“డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే పేరుతో ఉన్న వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురినైట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ ఇప్పటివరకు లేవు.  

అయితే, పలు రాష్ట్రాల సైబర్ భద్రతా సంస్థలు భారత్-పాక్  ఉద్రికతల నేపథ్యంలో సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, & ఇక్కడ). అలాగే, ఏవైనా అనుమానాస్పద వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఏమైనా ఫైల్స్, లింకులు ఓపెన్ చేయడం వల్లన సైబర్ దాడికి గురి అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అనుమానాస్పద ఇమెయిల్‌లు, ఫైల్‌లు, వెబ్‌సైట్‌లను ఓపెన్ చేయవద్దు.

2017లో ‘WannaCry ransomware’ సైబర్ దాడి సమయంలో “tasksche.exe” అనే మాల్వేర్ తో కూడిన ఫైల్‌తో సైబర్ దాడి జరిగింది, ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను ప్రభావితం చేసింది. WannaCry ద్వారా తీవ్రంగా ప్రభావితమైన దేశాలలో భారతదేశం కూడా ఉందని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడ).

 08 మే 2025న, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫాక్ట్-చెక్ విభాగం X (ట్విట్టర్)లో పాకిస్తాన్ చేసిన సైబర్ దాడి కారణంగా భారతదేశం అంతటా ATMలు 2–3 రోజులు మూసివేయబడతాయని అనే వార్త నిజం కాదని స్పష్టం చేసింది.

రాన్సమ్‌వేర్ సైబర్ దాడి:

రాన్సమ్‌వేర్ సైబర్ దాడులలో కంప్యూటర్‌ను ప్రభావితం చేసే హానికరమైన సాఫ్ట్‌వేర్ (మాల్వేర్) ద్వారా వినియోగదారులు డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా వారు డేటా యాక్సెస్‌ చేయకుండా నిరోధించి డేటాను అన్‌లాక్ చేయడానికి డబ్బును హ్యాకర్లు డిమాండ్ చేస్తారు, సాధారణంగా ఈ డబ్బు క్రిప్టోకరెన్సీలో చెల్లించబడుతుంది. ఇలాంటి రాన్సమ్‌వేర్ సైబర్ దాడికి ఉదాహరణ WannaCry (2017), ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను ప్రభావితం చేసింది. రాన్సమ్‌వేర్ సైబర్ దాడులకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. భారతదేశంలో జరిగిన ప్రధాన రాన్సమ్‌వేర్ దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I4C ) ద్వారా సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కూడా చురుకుగా పాల్గొంటుంది . I4C ప్రారంభించిన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా సైబర్ నేరాలను గురించి ప్రభుత్వానికి ప్రజలు నివేదించవచ్చు. MHA దాని అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ “సైబర్‌డోస్ట్” ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహనను కలిపిస్తుంది. MHA కింద పనిచేస్తున్న నేషనల్ కౌంటర్ రాన్సమ్‌వేర్ టాస్క్‌ఫోర్స్, రాన్సమ్‌వేర్ ముప్పులను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందిస్తుంది. CERT-In డేటా ప్రకారం, భారతదేశంలో సైబర్ దాడుల సంఖ్య 2020లో 11.58 లక్షలగా ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 20.41 లక్షలకు పెరిగింది.

చివరగా, “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురవుతారు అనే వార్త చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది. అయితే, ఇది కేవలం పుకారు మాత్రమే అని పేర్కొంటూ పలు ఫాక్ట్-చెకింగ్ సంస్థలు, వార్త సంస్థలు గతంలో కథనాలను ప్రచురించాయి.

Share.

About Author

Comments are closed.

scroll