Fake News, Telugu
 

రాజ్యాంగంలో శ్రీరాముడి, ఇతరుల చిత్రాల్ని పొందపరచాలన్నది రాజ్యాంగ సభ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం, అంబేద్కర్ సొంత నిర్ణయం కాదు

0

‘భారతీయులంతా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అంబేద్కర్ గారి కల, అందుకే శ్రీరాముడు చిత్రపటాన్ని రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచి ప్రాథమిక హక్కులు రూపకల్పన చేశారని’  చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతీయులంతా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగంలోని మూడవ భాగంలో శ్రీరాముడు చిత్రపటాన్ని పొందుపరిచాడు.

ఫాక్ట్ (నిజం): అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగం యొక్క చివరి డ్రాఫ్ట్ లో ఎలాంటి కళాకృతులు లేవు. అంబేద్కర్ సమర్పించిన చివరి డ్రాఫ్ట్ సభ ఆమోదం పొందిన తరవాత, రాజ్యాంగంలో భారతదేశ సాంస్కృతిక/కళాత్మక వారసత్వం తెలిసేలా కళాకృతులు ఉండాలని సభ అభిప్రాయపడింది. ఈ అంశంపై చర్చించి ప్రముఖ కళాకారుడు నందలాల్ బోస్‌కు ఈ బాధ్యతను అప్పగించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇందులో భాగంగానే రాజ్యాంగంలోని మూడో భాగం మొదట్లో రాముడు, సీత మరియు లక్ష్మణుడి చిత్రాలను పొందపరిచారు. భారత దేశ ఇతిహాసాలు, సంస్కృతీ , చరిత్ర ప్రతిబింబించేలా ఒక్కోక్క సెక్షన్ కి చరిత్రలోని ఒక్కొక్క సమయానికి చెందిన వాటితో అలంకరించారు. ఆలా గుప్తులు, అశోకుడు, బుద్ధుడు, మహావీరుడు, మహాభారతం, రామాయణం, అక్బర్, టిప్పు సుల్తాన్ మొదలగు వారి బొమ్మలను అందులో చేర్చారు. రాజ్యాగంలో రాముని చిత్రం ఉండడానికి కారణం ఇది. అదేవిధంగా భారతీయులంతా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అంబేద్కర్ అభిప్రాయపడినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రాజ్యాంగంలో రాముడి ప్రతిమ :

భారత రాజ్యాంగ రూపకల్పన చివరి దశలో, అంబేద్కర్ సభకు సమర్పించిన రాజ్యాంగం యొక్క చివరి డ్రాఫ్ట్ పై చర్చ జరిగి సభ ఆమోదం పొందింది. ఐతే అంబేద్కర్ సమర్పించిన ఈ డ్రాఫ్ట్ లో ఎటువంటి కళాకృతులు లేవు. ఇదే కేవలం ఒక డ్రాఫ్ట్ మాత్రమే.

ఐతే చివరి డ్రాఫ్ట్ ఆమోదం పొందిన తరవాత, భారత రాజ్యాంగ అసలు కాపీలో భారతదేశ సాంస్కృతిక/కళాత్మక వారసత్వం తెలిసేలా కళాకృతులు ఉండాలని సభ అభిప్రాయపడింది. ఈ అంశంపై చర్చించి ప్రముఖ కళాకారుడు నందలాల్ బోస్‌కు ఈ బాధ్యతను అప్పగించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.

అలా భారత రాజ్యాంగం యొక్క అసలు మాన్యుస్క్రిప్ట్‌ను భారతదేశ చరిత్ర ప్రతిబింబించేలా పౌరాణిక, ఇతిహాసాలలోని పాత్రలు, పాలకుల, స్వతంత్ర సమరయోధుల మొదలైన వివిధ కళాకృతులను నందలాల్ బోస్‌ మరియు అతని టీం రాజ్యాంగంలోని వివిధ భాగాలూ/చాప్టర్స్ లో పొందపరిచారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పొందుపరిచిన మూడో భాగంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీత యొక్క కళాకృతులను ఏర్పాటు చేసాడు.

అంతే కాదు, భారత దేశ ఇతిహాసాలు, సంస్కృతీ , చరిత్ర ప్రతిబింబించేలా ఒక్కోక్క సెక్షన్ కి చరిత్రలోని ఒక్కొక్క సమయానికి చెందిన వాటితో అలంకరించాడు. ఆలా గుప్తులు, అశోకుడు, బుద్ధుడు, మహావీరుడు, మహాభారతం, రామాయణం, అక్బర్, టిప్పు సుల్తాన్ మొదలగు వారి బొమ్మలను అందులో చేర్చారు. మొత్తం బొమ్మల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. రాజ్యాగంలో రాముని చిత్రం ఉండడానికి కారణం ఇది. ఈ అసలు కాపీని ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవొచ్చు.

ఐతే పైన చెప్పినట్టు ఇలా రాజ్యాంగంలో వివిధ కళాకృతులను పొందపరచాలని నిర్ణయం రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా తీసుకున్నది, ఇది కేవలం అంబేద్కర్ నిర్ణయం కాదు. అసలు అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగం యొక్క చివరి డ్రాఫ్ట్ లో ఎలాంటి కళాకృతులు లేవు.

రామునిపై అంబేద్కర్ అభిప్రాయం :

భారతీయులంతా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అంబేడ్కర్ అభిప్రాయపడ్డట్టు ఎటువంటి సమాచారం లేదు. నిజానికి అంబేడ్కర్ రాముడు, కృష్ణుడు, రామాయణం, మహాభారతం మొదలైన వాటిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. రిడిల్స్ ఇన్ హిందూయిజం (Riddles in Hinduism) అనే రచనలో అంబేద్కర్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసాడు.

చివరగా, రాజ్యాంగంలో రాముడి చిత్రాన్ని పొందపరచాలన్నది రాజ్యాంగ సభ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం, అంబేద్కర్ సొంత నిర్ణయం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll