Fake News, Telugu
 

అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను కాంగ్రెస్ వ్యతిరేకించలేదు

0

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జి.ఆర్. స్వామినాథన్ మధురైలోని తిరుప్పరంకుండ్రంలోని సుబ్రమణ్య స్వామి ఆలయ అధికారులను కొండపై ఉన్న దర్గా దగ్గర ఉన్న రాతి స్తంభమైన దీపథూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని ఆదేశించారు. పక్షపాతం, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆయనపై అభిశంసన (Impeachment) నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకులు జి.ఆర్. స్వామినాథన్‌ను న్యాయమూర్తిగా తొలగించటానికి పోరాటం చేస్తున్నారు కానీ, జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై (ఇక్కడ, ఇక్కడ) ఆయనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసును కాంగ్రెస్ వ్యతిరేకించింది అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. 

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: మధురైలోని సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో దీపస్థంభంపై దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్‌ స్వామినాథన్‌ ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ అభిశంసన (Impeachment) నోటీసును సమర్పించింది కానీ 15 కోట్లతో పట్టుబడ్డ అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం తెలగించాలని జారీ చేసిన నోటీసులను వ్యతిరేకించింది. 

ఫాక్ట్ (నిజం): అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను కాంగ్రెస్ వ్యతిరేకించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి, ఈ మెమోరాండంపై సంతకం చేసిన వారిలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు. పలు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ ఈ ప్రక్రియకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేసారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తుంది. 

దీని గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కాంగ్రెస్ జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తిగా తొలగించే ప్రక్రియను వ్యతిరేకించినట్టు ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు. తదుపరి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, మరియు 218 కింద జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానంపై 145 మంది లోక్‌సభ సభ్యులు సంతకం చేశారని పలు కథనాలు ప్రచురించటం గమనించాం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

కాంగ్రెస్, TDP, JD(U), JD(S), జనసేన పార్టీ, ఏజీపీ, శివసేన (షిండే), LJP, SKP, CPI(M) మొదలైన వివిధ పార్టీల ఎంపీలు ఈ మెమోరాండంపై సంతకం చేశారని కథనాలు పేర్కొన్నాయి. సంతకం చేసిన ప్రముఖులలో ఎంపీలు అనురాగ్‌ఠాకూర్, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పిపి చౌదరి, సుప్రియా సూలే, కెసి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ ఈ ప్రక్రియను వ్యతిరేకించలేదని స్పష్టమయింది. 

అంతే కాకుండా,“1968 న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రకారం జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన 63 మంది రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌కు ఒక తీర్మాన నోటీసును సమర్పించారు” అంటూ కాంగ్రెస్ నాయకుడు X పోస్టు ద్వారా 21 జూన్ 2025న తెలిపారు. “ఇండియా బ్లాక్ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి, స్పీకర్‌కు రాసిన లేఖలపై సంతకం చేస్తున్నాయి” అని కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ అన్నారు.

చివరిగా, అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను కాంగ్రెస్ వ్యతిరేకించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll