Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోను పక్షులు ఎగరటానికి ప్రధాని మోదీనే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చెయ్యబడుతోంది. ఈ వీడియోలో గాంధీ ఆకాశం వైపు చూపిస్తూ “గద్దలు  ఎందుకు ఎగురుతాయి?” అని ప్రశ్నించి, “దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయంసేవక్ (RSS), భారతీయ జనతా పార్టీ (BJP)” అని అన్నాడు. దీని వెనుక ఉన్న నిజానిజాలెంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. 

ఆర్కైవ్ చేసిన వీడియోను ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: రాహుల్ గాంధీ తన ప్రసంగంలో,  గద్దలు ఎగరటానికి  ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీని బాధ్యులు అని అన్నారు. 

ఫాక్ట్ (నిజం): ఇది ఎడిట్ చెయ్యబడ్డ వీడియో. అసలు వీడియోలో, ఆ ప్రదేశంలో ఉన్న చెత్త కారణంగా గద్దలు తిరుగుతున్నాయని, సాధారణ ప్రజలు పేద పరిస్థితులలో బాధపడుతున్నారని, ప్రధానమంత్రి మోదీ ధనవంతులకు పన్ను రాయితీలు ఇస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాబట్టి ఈ పోస్టు తప్పు.

వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్ ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చైయగా దీనికి సంబంధించిన పూర్తి వీడియోను మేము కనుగొన్నాము. ఇది 5 ఫిబ్రవరి 2020న న్యూఢిల్లీలోని కొండ్లిలో గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన సందర్భంలోది. 

పూర్తి వీడియోను పరిశీలించగా, రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, గత ఐదు సంవత్సరాలుగా దేశంలో సామరస్యం ఎలా దెబ్బతిందో చెప్పారు. 2:43 టైమెస్టాంప్ వద్ద గాంధీ “దీని వెనుక కారణం ఏమిటి? చాలా మంది దీనికి కారణం నరేంద్ర మోదీ అని, RSS అని లేదా BJP అని చెబుతారు .కానీ, నేను దానిని భిన్నంగా చూడాలనుకుంటున్నాను. అతిపెద్ద కారణం ఏమిటంటే దేశంలోని యువతకు ఎటువంటి లక్ష్యం లేదు. వారు నిరుద్యోగానికి భయపడుతున్నారు” అని మాట్లాడారు.

10:04 టైమెస్టాంప్ వద్ద గాంధీ అక్కడ తిరుగుతున్న గద్దలను చూపిస్తూ, సాధారణ ప్రజలు పేద పరిస్థితులలో బాధపడుతున్నారని, ప్రధానమంత్రి మోదీ ధనవంతులకు పన్ను రాయితీలు ఇస్తారని మాట్లాడుతూ, “ఈ గద్దలు  ఇక్కడ ఏమి చేస్తున్నాయో చెప్పండి. అవి ఇక్కడ ఎందుకు ఎగురుతున్నాయి? గద్దలు  ఇక్కడ ఎందుకు ఎగురుతున్నాయో ఎవరైనా చెప్పగలరా? ఈ మురికిని తొలగించడానికి ఎన్ని కోట్లు అవసరమవుతాయి? నరేంద్ర మోదీ భారతదేశంలోని అత్యంత ధనవంతుల కోసం రూ. 1,30,000 కోట్ల పన్నులను రద్దు చేశారు. మీరు 24*7 మురికిలోనే ఉంటారు, ధనవంతులు కోటలలో ప్రశాంతంగా జీవిస్తున్నారు” అని అన్నారు. ఈ పూర్తి స్పీచ్ యొక్క డాక్యుమెంట్ కాంగ్రెస్ అధికారిక వెబ్సైటులో అప్లోడ్ చెయ్యబడింది. 

సోషల్ మీడియా వినియోగదారులు, ఈ రెండు క్లిప్‌ల క్రమాన్ని మార్చి, గద్దలు  అక్కడ ఎగరటానికి బీజేపీ ప్రభుత్వం కారణమని గాంధీ ఆరోపించినట్టు ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.

చివరిగా, ఒక ఎడిటెడ్ వీడియోను పక్షులు ఎగరటానికి ప్రధాని మోదీనే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll