Fake News, Telugu
 

సముద్రంలో గల్లంతైన ఈ కంటైనర్‌లో దొరికింది సిగరెట్లు; ఐఫోన్లు కాదు

0

సముద్రంలో తేలుతూ వెళుతున్న కంటైనర్‌ను అటుగా  నౌకలో వెళ్తున్న వ్యక్తులు తెరిచి చూడగా అందులో యాపిల్ ఐ ఫోన్లు దొరికాయని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.   

క్లెయిమ్: సముద్రంలో గల్లంతైన కంటైనర్ లో దొరికిన ఐఫోన్లను అటుగా నౌకలో వెళ్తున్న వ్యక్తులు తీసుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను 2018 నుంచి “Denis Mikhailenko” అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశారు. ఈ పెట్టెలలో ఉన్నది సిగరెట్లు అని వీడియో కింద వివరణలో పేర్కొన్నారు. పెట్టెలపైన సిగరెట్ కంపెనీ పేరు “D&B” ని చూడవచ్చు. అలాగే, “First Quality tobacco deluxe filter” అని కూడా రాసి ఉంది. ఐఫోన్లు ఇలా గల్లంతైన కంటైనర్లో దొరికినట్లు వార్తా సంస్థలు కానీ యాపిల్ కంపెనీ కానీ ఎక్కడా ప్రకటించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ ఘటన గురించి సంబంధిత పదాలతో ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన వివిధ వీడియోలు ‘Denis Mikhailenko’ అనే యూట్యూబ్‌ ఛానెల్లో లభించాయి. ముందుగా 03 ఆగస్టు 2018న అప్లోడు చేసిన వీడియోలో నౌకలో ఉన్న వ్యక్తులు కంటైనర్‌ను నౌక వద్దకు లాగుతున్నట్లు చూడవచ్చు. ఇక 03 జూన్ 2020లో కంటైనర్‌ను తెరిచి అందులో ఉన్న పెట్టెలను నౌకలోని వ్యక్తులు  తీసుకుంటున్న మరొక వీడియోను పోస్టు చేశారు. ఈ పెట్టెలలో ఉన్నది సిగరెట్లు అని వీడియో కింద వివరణలో పేర్కొన్నారు.

చివరిగా 18 ఆగస్టు 2021లో పోస్టు చేసిన పూర్తి వీడియోలో ఈ పెట్టెలపైన ఉన్న సిగరెట్ కంపెనీ పేరు “D&B” ని చూడవచ్చు. అలాగే, “First Quality tobacco deluxe filter” అని రాసి ఉండటం కూడా చూడవచ్చు.

“D&B” కంపెనీ యొక్క లోగోను ఇక్కడ చూడవచ్చు. ఇది వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలతో మ్యాచ్ అవుతుంది. మరియు, ఐఫోన్లు ఇలా గల్లంతైన కంటైనర్లో దొరికినట్లు వార్తా సంస్థలు కానీ, యాపిల్ కంపెనీ కానీ ఎక్కడా ప్రకటించలేదు.

చివరిగా, వీడియోలో ఉన్న గల్లంతైన కంటైనర్‌లో దొరికింది ఐఫోన్లు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll