Fake News, Telugu
 

మతం మారినంత మాత్రాన వారసత్వంగా తమకు సంక్రమించాల్సిన ఆస్తి హక్కులను పిల్లలు కోల్పోరు

0

“తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా మతం మారిన సంతానానికి ఆస్తిలో వాటా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు కన్నవారికి చట్టప్రకారం కూడా ఉంది. పిల్లలు కోర్టుకి వెళ్లే హక్కు లేదు” అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు ప్రచారం లో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మతం మార్చుకున్న సంతానానికి ఆస్తిలో వాటా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే హక్కు కన్నవారికి చట్టప్రకారం ఉంటుంది. పిల్లలకు కోర్టుకు వెళ్ళే హక్కు కూడా లేదు.

ఫ్యాక్ట్ (నిజం): హిందూ వారసత్వ చట్టం, 1956  ప్రకారం మతం మార్చుకున్న వాళ్ళు కూడా వారసత్వ ఆస్తికి వారసులుగా అర్హులు. అయితే, తల్లితండ్రులు సంపాదించిన ఆస్తుల పైన హక్కు పూర్తిగా తల్లితండ్రులకే ఉంటుంది. మతం మారినా, మారకున్నా, పిల్లలకు తాము సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాలో వద్దో నిర్ణయించే అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది. కేవలం మతం మారిన పిల్లలను ఉద్దేశించి ఎక్కడా ప్రత్యేక చట్టాలు లేవు. ఒకవేళ వీలునామా లేకుండా తల్లి/తండ్రి మరణిస్తే, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మతంతో సంబంధం లేకుండా వారసులకు రావలసిన వాటా వస్తుంది. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.      

ముందుగా, పోస్టులో ఉన్న సంఘటన గురించి వెతుకగా, దినమలార్ అనే తమిళ వార్తా పత్రిక తన వెబ్‌సైట్లో 01 జనవరి 2022న ప్రచురించిన కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, కాంచీపురానికి చెందిన, హిందూ మతస్తుడైన వేలాయుథం అనే  85 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. తన ముగ్గురు సంతానం క్రైస్తవ మతానికి చెందిన వారిని పెళ్లి చేసుకొని క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అయితే, పిల్లలు అందరూ వేరే మతంలో ఉన్న కారణంగా తాను  చనిపోయాక  అంత్యక్రియలు హిందూ సంప్రదాయంలో చెయ్యరు అని భావించి, తాను సొంతంగా సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇంటిని తన, తన భార్య తదనంతరం కాంచీపురం మురుగన్ గుడికి చెందేలా వీలునామా రాశారు.

మతం గురించి రాజ్యాంగం ఏం చెబుతుంది ?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (Right to freedom of religion) ప్రకారం, భారత పౌరులందరికీ మత స్వాతంత్ర హక్కు ఉంటుంది.

భారత దేశంలో వారసత్వ ఆస్తి హక్కుల గురుంచి చట్టాలు ఏమి చెప్తున్నాయి?

భారతదేశపు  పౌరుల యొక్క ఆస్తి హక్కులకి  సంబంధించి వారి మత విశ్వాసాలని బట్టి వివిధ చట్టాలు అమలవుతాయి.

ఒక వ్యక్తికి ఆస్తి రెండు రకాలుగా వచ్చే అవకాశం ఉంది.

  1. వంశపారంపర్య ఆస్తి. (3 లేదా అంతకంటే ఎక్కువ తరాల నుంచి సంక్రమిస్తున్నది)
  2. తాను సొంతంగా సంపాదించిన ఆస్తి.

వంశపారంపర్య ఆస్తిపై ఆయా చట్టాల్లో ఉన్న నియమాలను బట్టి అర్హులైన వారసులందరికీ వాటా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్న ఆస్తిని రెండు విధాలుగా పంచవచ్చు:

  1. తాను బ్రతికి ఉండగా గిఫ్ట్ డీడ్ లేదా పార్టిషన్ డీడ్ ద్వారా కుటుంబ సభ్యులకు లేదా బయటి వాళ్ళకు ఆస్తిని ఇవ్వడం.
  2. వీలునామా ద్వారా తాను మరణించాక కుటుంబ సభ్యులకు లేదా బయటి వాళ్ళకు ఇవ్వడం.

ఆయితే, ఎటువంటి వీలునామా లేకుండా వ్యక్తి చనిపోతే, ఆస్తి ఎవరెవరికి చెందాలి  అనేది ఆ కుటుంబం యొక్క మతాన్ని బట్టి, సంబంధిత చట్టాల ప్రకారం నిర్ణయిస్తారు.

కుటుంబ సభ్యుడు మతం మారితే ఏమవుతుంది?

కుటుంబంలో ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోతే, హిందూ వారసత్వపు చట్టం,1956 ప్రకారం అర్హులైన వారసులందరికి ఆస్తి సమాన వాటాలుగా పంచబడుతుంది. ఈ వారసులలో ఎవరైనా అప్పటికే వేరే మతంలో ఉన్నా కూడా వారికి రావలసిన వాటా దక్కుతుంది. దీనికి సంబంధించి బొంబాయి హై కోర్ట్ ఇచ్చిన తీర్పు కాపీ ఇక్కడ చూడొచ్చు.

అయితే, హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 26,ప్రకారం ఈ మతం మారిన వ్యక్తి యొక్క సంతానానికి మాత్రం కుటుంబ ఆస్తి పంపకాల సమయంలో, ఒకవేళ హిందువు కాకుంటే, ఎటువంటి వాటా దక్కదు.

ఆయితే, కేవలం “మతం మారిన” పిల్లలకు తల్లితండ్రులు తమ ఆస్తిలో వాటా ఇవ్వాలో వద్దో అని చెప్పే చట్టం ఎక్కడా లేదు. ఏ విషయం కారణంగా అయినా తల్లి/తండ్రి  వీలునామాలో సంతానానికి తన ఆస్తిలో ఎంత వాటా రావాలో నిర్ణయించే హక్కు ఉంటుంది. ఒకవేళ, వీలునామా లేకుండా తల్లి/తండ్రి మరణిస్తే పిల్లల మతానికి సంబంధం లేకుండా చట్ట  ప్రకారం తమకు రావలసిన వాటా తమకు వస్తుంది.

చివరిగా, మతం మారిన వ్యక్తులకు కూడా వారసత్వ ఆస్తిలో వాటా ఉంటుంది. మతం మారినా, మారకున్నా,  పిల్లలకు తాము సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాలో వద్దో నిర్ణయించే అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది.   

Share.

About Author

Comments are closed.

scroll