Fake News, Telugu
 

కొబ్బరి నూనె, యాలకులు లేదా ‘Eupatorium Perfoliatum 200 CH’ రెండు రోజుల్లో డెంగీ జ్వరాన్ని నయం చెయ్యవు.

0

కొబ్బరి నూనె యాంటిబయోటిక్‌గా పనిచేస్తుంది, దానిని మోకాళ్ల నుండి అరికాళ్ళ వరకు రాసుకోవటం వల్ల డెంగీ రాకుండా నిరోధించవచ్చు, ఎందుకంటే డెంగీని కలిగించే దోమ మోకాళ్లపైకి ఎగరదు అని, పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకుంటే రక్త కణాలు పెరుగుతాయని, డెంగీ లేదా సాధారణ జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే, Eupatorium Perfoliatum 200 CH అనే హోమియోపతి ఔషధాన్ని 2 రోజులు తాగితే నయమౌతుందని ఒక పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిలో ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: కొబ్బరి నూనె డెంగీని నివారిస్తుంది. పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకుంటే రక్త కణాలు పెరుగుతాయి. ‘Eupatorium Perfoliatum 200 CH అనే హోమియోపతి ఔషధం డెంగీను రెండు రోజుల్లో నయం చేస్తాయి. 

ఫాక్ట్(నిజం): కొబ్బరి నూనె డెంగీని నివారించదు. యాలకుల గింజలు రక్త కణాలను పెంచవు. ‘Eupatorium Perfoliatum 200 CH’ డెంగీ జ్వరానికి సూచించవచ్చు కానీ, కేవలం రెండు రోజుల్లో డెంగీను నయం చేయగలదని నిరూపించడానికి సమాచారం లేదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విదంగా ఉంది.

ముందుగా, కీలక పదాలను ఉపయోగించి డెంగీ వ్యాప్తి మరియు కారణాల గురించి ఇంటర్నెట్లో వెతికినప్పుడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO) వెబ్‌సైట్ న్యూస్‌రూమ్ విభాగంలో దీనిని వివరిస్తున్నట్లు గమనించాం. డెంగీ అనేది ఆడ దోమల వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. కానీ, యాంటీబయాటిక్స్ ప్రధానంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతే కాకుండా, WHO ప్రకారం, ‘దోమ గుడ్లు పెట్టడానికి నీటితో నిండిన కంటైనర్ల కోసం వెతుకుతూ 400 మీటర్ల వరకు ఎగురుతుంది కానీ సాధారణంగా మానవ నివాసానికి దగ్గరగా ఉంటుంది.’ అని చెప్పింది. 

కొబ్బరి నూనె యొక్క యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు చర్మ సంరక్షణ మరియు ఆయిల్ పుల్లింగ్ మొదలైన వివిధ ప్రయోజనాల కోసం వాడతారు. కానీ, తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఇది యాంటీబయాటిక్‌లకు బదులుగా వాడవచ్చు అని ఏ రిపోర్టు చూపలేదు.

తదుపరి, ‘Eupatorium Perfoliatum 200 CH’ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు, ‘1mg’ మెడికల్ వెబ్‌సైట్‌లో ‘Eupatorium Perfoliatum 200 CH’ ‘మలేరియా మరియు డెంగీ జ్వరాలకు సమర్థవంతమైన ఔషధం’ అని కనుగొనబడింది. డెంగీ జ్వరానికి ఈ హోమియోపతి ఔషధం సూచించబడుతుందనేది నిజమే అయినప్పటికీ కేవలం రెండు రోజుల్లో డెంగీను నయం చేయగలదని సమాచారం లేదు (ఇక్కడ మరియు ఇక్కడ).

ప్లేట్‌లెట్ సంఖ్యను పెంచడానికి యాలకుల గింజలు సహాయపడతాయి అని ఏ సైంటిఫిక్ రిపోర్టులోనూ నిరూపించబడలేదు. ఫాక్ట్లీ ఇటువంటి దావాలకు సంబంధించిన కథనాలను ఇంతకముందు ప్రచురించింది (ఇక్కడ మరియు ఇక్కడ). 

చివరిగా, యాలకుల గింజలు లేదా ‘Eupatorium Perfoliatum 200 CH’ రెండు రోజుల్లో డేంగీ జ్వరాన్ని నయం చెయ్యవు.

Share.

About Author

Comments are closed.

scroll