Fake News, Telugu
 

తమకు నచ్చినట్టుగా అంకెలను పోలుస్తూ బీజేపీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కువ అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

1

బీజేపీ ప్రభుత్వ హయంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీడీపీ మరియు ఎగుమతుల వృద్ది రెట్లు ఎక్కువ ఉండేవని, నిరుద్యోగం తక్కువ ఉండేదని, కొన్ని అంకెలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : కాంగ్రెస్ హయాంలో జీడీపీ మరియు ఎగుమతుల వృద్ధి రెట్లు 8.2% మరియు 69% గా ఉంటే, బీజేపీ హయాంలో అవి 5% మరియు -9.71% గా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగం 2.2% ఉంటే, బీజేపీ హయాంలో అది 7.9% ఉంది. 

ఫాక్ట్ (నిజం): సమాన సమయాల్లో వృద్ధి రేట్లను తీసుకోకుండా తమకి నచ్చిన అంకెలను తీసుకొని పోస్టులో రెండు ప్రభుత్వాలను పోలుస్తున్నారు. కావున పోస్ట్ లో తప్పుగా పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో మూడు రకాల అంకెలను కాంగ్రెస్ మరియు బీజేపీ హయాంలల్లో పోల్చారు. ఒక్కొక్కటిగా విశ్లేషిద్ధాం.

జీడీపీ వృద్ధి:

గత నెల 30న ‘National Statistical Office’ (Ministry of Statistics and Programme Implementation – MoSPI) వారు రిలీజ్ చేసిన ‘Estimates of Gross Domestic Product for the first quarter’ ప్రకారం, ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం యొక్క జీడీపీ వృద్ధి రేటు 5%. మోడీ హయాంలో తాజాగా వెలువడిన ఒక త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటు అంకెను తీసుకొని తమకు నచ్చినట్టుగా కాంగ్రెస్ హయాంలో 2006-07 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన 8.1% జీడీపీ వృద్ధి రేటుతో పోలుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా 2011-12 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.2% ఉన్నట్టుగా ‘MOSPI’ వెబ్ సైట్ లో చూడవచ్చు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.8% గా అంచనా వేయబడింది.

నిరుద్యోగం:

గతంలో ‘National Sample Survey Office’ వారు ఐదేళ్ళకు ఒకసారి నిరుద్యోగ రేటుని లెక్కించేవారు, కానీ ఇప్పుడు సంవత్సరానికి (‘Periodic Labour Force Survey’) ఒకసారి లెక్కిస్తున్నారు. ఐదేళ్ళకు ఒకసారి లెక్కించినప్పుడు 2011-12 సంవత్సరంలో కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగం 2.2% ఉంది. తాజాగా మే నెలలో ‘MOSPI’ వారు ప్రకటించిన ‘Periodic Labour Force Survey’ ప్రకారం 2017-18 సంవత్సరానికి నిరుద్యోగ రేటు 6.1% గా ఉంది. పోస్ట్ లోని నిరుద్యోగ రేటు దీనితో మ్యాచ్ అవ్వదు.

అయితే, ‘Centre for Monitoring Indian Economy’ అనే సంస్థ ఇచ్చిన అంకెల ప్రకారం జూన్-2019 లో భారతదేశంలో నిరుద్యోగ రేటు 7.9% కి చేరింది. అంటే, జూన్-2019 కి ఒక ప్రైవేటు సంస్థ ఇచ్చిన అంకెలను తీసుకొని 2011-12 సంవత్సరానికి ప్రభుత్వ సంస్థ ఇచ్చిన అంకెలతో పోలుస్తున్నారు.

ఎగుమతుల వృద్ధి:

వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ద్వారా గత సంవత్సరం జూన్ నేలతో పోలుస్తే ఈ సంవత్సరం జూన్ నెలలో భారతదేశ ఎగుమతులు 9.7% తగ్గినట్టు తెలుస్తుంది. ఆ అంకెను తీసుకొని కాంగ్రెస్ హయాం మొత్తంలో (పదేళ్ళలో) పెరిగిన 69% ఎగుమతుల రేటుతో పోలుస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హయంలో 2014-15 మరియు 2018-19 మధ్య ఎగుమతులు 6.4% పెరిగాయి.

చివరగా, తమకు నచ్చినట్టుగా అంకెలను పోలుస్తూ బీజేపీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కువ అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll