ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ కి 46.6 శాతం ఓట్లు వస్తే, ఆప్, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలకు కలిపి కేవలం 47.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని, ఆ ఒక్క శాతం ఓట్లు వల్ల బీజేపీ 20 స్థానాల వరకు ఓడిపోయిందని చెప్తూ ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ కి 46.6 శాతం ఓట్లు వస్తే, ఆప్, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలకు కలిపి 47.8 శాతం ఓట్లు వచ్చాయి.
ఫాక్ట్ (నిజం): ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ కి కేవలం 38.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ, జేడీయూ మరియు ఎల్జేపీ పొత్తుకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఆప్ పార్టీకి 53.57 శాతం ఓట్లు వచ్చాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
ఏ పార్టీకీ ఎంత శాతం ఓట్లు వచ్చాయో అనే సమాచారం, భారత ఎన్నికల కమిషన్ వారి వెబ్ సైట్ లో దొరికుతుంది. ఆ వెబ్ సైట్ లో వివరాలు చూడగా, బీజేపీ కి కేవలం 38.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. బీజేపీ తో పొత్తులో భాగంగా 70 సీట్లలోని 3 సీట్లలో జేడీయూ (2 సీట్లు) మరియు ఎల్జేపీ (1 సీట్) పోటీ చేసాయి. బీజేపీ, జేడీయూ మరియు ఎల్జేపీ కి కలిపి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చినట్టు చూడవొచ్చు. కానీ, ఒక్క ఆప్ పార్టీకే 53.57 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే, కాంగ్రెస్ కి 4.26 శాతం ఓట్లు వస్తే, లెఫ్ట్ పార్టీలకు 1 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
చివరగా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ కి 46.6 శాతం ఓట్లు వస్తే, ఆప్, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలకు కలిపి 47.8 శాతం ఓట్లు వచ్చాయన్న సమాచారంలో ఎటువంటి నిజం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?