మార్చ్ 23న భగత్ సింగ్ వర్ధంతి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించి పలు పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘భగత్ సింగ్ తరపున కోర్టులో అసఫ్ అలీ అనే న్యాయవాది వాదించగా, భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఆర్ఎస్ఎస్ సభ్యుడు సూర్యనారాయణ మిశ్రా వాదించాడని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: భగత్ సింగ్ తరపున కోర్టులో అసఫ్ అలీ అనే న్యాయవాది వాదించగా, భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఆర్ఎస్ఎస్ సభ్యుడు సూర్యనారాయణ మిశ్రా వాదించాడు.
ఫాక్ట్ (నిజం): భగత్ సింగ్ తన జీవిత కాలంలో రెండు కేసులకు సంబంధించి విచారణలను ఎదుర్కొన్నాడు. ఒకటి ఢిల్లీలోని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై జరిగిన బాంబు దాడికు సంబంధించింది కాగా మరొకటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్ హత్యకు సంబంధించినది. భగత్ సింగ్‌కు ఉరి శిక్ష పడింది సాండర్స్ హత్య కేసులోనే. ఐతే ఈ కేసులో లాలా దుని చంద్ అనే న్యాయవాది సహాయం తీసుకొని భగత్ సింగ్ తన కేసును తానే వాదించుకున్నాడు. సుఖ్‌దేవ్ తరపున మాత్రం అసఫ్ అలీ వాదించారు. ఈ కేసులో న్యాయమూర్తిగా వ్యవహరించిన రాయ్ సాహెబ్ పండిట్ శ్రీ కిషన్‌కు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే అసెంబ్లీ బాంబు కేసులో బ్రిటిష్ ప్రభుత్వం తరపున వాదించింది రాయ్ బహదూర్ సూరజ్ నారాయణ్‌కు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
భగత్ సింగ్ తన జీవిత కాలంలో రెండు కేసులకు సంబంధించి విచారణలను ఎదుర్కొన్నాడు. మొదటిది ఢిల్లీలోని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై జరిగిన బాంబు దాడికి గాను హత్యాయత్నం మరియు కుట్ర ఆరోపణలకు సంబంధించింది. రెండవది లాహోర్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్ హత్యకు సంబంధించినది, ఈ కేసును లాహోర్ కుట్ర కేసు అని కూడా అంటారు.
భగత్ సింగ్ విచారణలను ఎదుర్కొన్న ఈ రెండు కేసులలో ఎవరు తన తరపు వాదించారో, ఎవరు బ్రిటిష్ ప్రభుత్వం తరపు వాదించారో కింద చూద్దాం.
అసెంబ్లీపై బాంబు దాడి కేసు:
08 ఏప్రిల్ 1929న, భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబును విసిరి, పోలీసులకు లొంగిపోయారు. ఈ కేసులో విచారణ అనంతరం వారిద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఐతే ఈ కేసుకు సంబంధించిన తీర్పు యొక్క డిజిటల్ రికార్డులు ప్రకారం, భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ ఇద్దరి తరపున అసఫ్ అలీ వాదించాడని ఉంది. అలాగే రాయ్ బహదూర్ సూరజ్ నారాయణ్ బ్రిటిష్ ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహారించాడని ఉంది.

కాని ప్రముఖ న్యాయవాది A.G. నూరానీ తన పుస్తకం ‘ది ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్ — పాలిటిక్స్ ఆఫ్ జస్టిస్’ లో, అసఫ్ అలీ బటుకేశ్వర్ దత్‌కు ప్రాతినిధ్యం వహించాడని, భగత్ సింగ్ మాత్రం న్యాయ సలహాదారు సహాయంతో తానే స్వయంగా కేసు వాదించుకున్నాడని పేర్కొన్నాడు.
నూరానీ ఈ పుస్తకంలో తన వాదనకు మద్దతుగా తనకు న్యాయవాది అవసరం లేదని, కేవలం కొన్ని అంశాలపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నానని’ భగత్ సింగ్ తన తండ్రికి రాసిన లేఖను పేర్కొన్నాడు. అలాగే భగత్ సింగ్ తానే స్వయంగా కేసు వాదించుకున్నట్టు అసఫ్ అలీ ప్రస్తావించిన సందర్భాన్ని ఈ పుస్తకంలో నూరానీ పేర్కొన్నాడు.

ది హిందూ పత్రిక కూడా ఈ కేసులో అసఫ్ అలీ బటుకేశ్వర్ దత్ తరపున వాదించి, భగత్ సింగ్ తాను స్వయంగా కేసు వాదించుకునేందుకు సహాయ పడ్డాడని పేర్కొంది.
నూరానీ రాసిన పుస్తకంలో కూడా రాయ్ బహదూర్ సూరజ్ నారాయణ్ బ్రిటిష్ ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహారించాడని పేర్కొన్నాడు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు సూరజ్ నారాయణ్‌కు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
లాహోర్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్ హత్య కేసు :
ఈ కేసు విచారణ అనంతరం అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్‌ను హత్య చేసినందుకు గాను భగత్ సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్ మరియు రాజ్ గురు ముగ్గురికి మరణ శిక్ష విధించారు. చివరికి, 23 మార్చి 1931న ముగ్గురిని ఉరితీశారు.
ఐతే ఈ కేసుకు సంబంధించిన తీర్పు యొక్క డిజిటల్ రికార్డుల ప్రకారం ఈ కేసులో లాలా దుని చంద్ అనే న్యాయవాది సహాయం తీసుకొని భగత్ సింగ్ తన కేసును తానే వాదించుకున్నాడు. సుఖ్‌దేవ్ తరపున మాత్రం అసఫ్ అలీ వాదించారు.

ఇకపోతే ఈ కేసులో బ్రిటిష్ ప్రభుత్వం తరపున నోర్డ్ అనే న్యాయవాది వాదించాడు. పైన తెలిపిన నూరాని పుస్తకంలో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. దీన్నిబట్టి భగత్ సింగ్ ఉరికి కారణమైన కేసులో ఆయనకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం తరపున వాదించింది ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తి కాదని స్పష్టంగా తెలుస్తుంది.
ఐతే భగత్ సింగ్‌కు ఉరి శిక్ష పడ్డ ఈ సాండర్స్ హత్య కేసులో న్యాయమూర్తిగా వ్యవహరించింది రాయ్ సాహెబ్ పండిట్ శ్రీ కిషన్, ఇతనికి ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
అదేవిధంగా ఈ కేసు విచారణ కోసం ముగ్గురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రిబ్యునల్‌లో పోస్టులో పేర్కొన్న జస్టిస్ సయ్యద్ అఘా హైదర్ ఒక్కడు. ఐతే కేసు విచారణ సరిగ్గా జరగలేదని అభిప్రాయపడి, మిగిలిన ఇద్దరు న్యాయముర్తులలాగా బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోవడంతో జస్టిస్ సయ్యద్ అఘా హైదర్‌ను ఈ ట్రిబ్యునల్ నుండి తొలగించారని నూరాని తన పుస్తకంలో పేర్కొన్నాడు, పోస్టులో చెప్తున్నట్టు జస్టిస్ అఘా హైదర్ తాను స్వయంగా రాజీనామా చేయలేదు. పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) కూడా ఇదే పేర్కొన్నాయి.

చివరగా, భగత్ సింగ్ న్యాయ నిపుణుల సలహాలతో తన కేసులను తానే వాదించుకున్నాడు ; రాయ్ బహదూర్ సూరజ్ నారాయణ్ మరియు రాయ్ సాహెబ్ పండిట్ శ్రీ కిషన్‌కు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.