Fake News, Telugu
 

టెర్రరిస్ట్ ని సరిగ్గా చూసుకోవాలని NSA అజిత్ దోవల్ కి అరుంధతీ రాయ్ లేఖ రాయలేదు

1

ఒక వ్యక్తి ‘FACTLY’ వారి ఫేస్బుక్ చాట్ లో ఒక న్యూస్ వెబ్సైట్ కథనాన్ని (ఆర్కైవ్డ్ ) పంపించి, దాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. ఆ కథనంలో ‘అరెస్టు చేయబడిన ఒక ఉగ్రవాదిని నేషనల్ కరెక్షనల్ సిస్టం ఫెసిలిటీస్ లో కేంద్రం సరిగ్గా చూసుకోవడం లేదు’ అని అరుంధతీ రాయ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి లేఖ రాసిందనీ, దానికి బదులిస్తూ ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కూడా ఆమెకి ఒక లేఖ రాసారని ఉంది. ఆ కథనం లో చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

క్లెయిమ్: అరెస్ట్ చేయబడిన టెర్రరిస్ట్ ని నేషనల్ కరెక్షనల్ సిస్టం ఫెసిలిటీస్ లో కేంద్రం సరిగ్గా చూస్కోవడం లేదంటూ అరుంధతీ రాయ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి లేఖ రాసింది, దానికి బదులిస్తూ ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ మరొక లేఖ రాసారు.

ఫాక్ట్ (నిజం): కథనంలో పేర్కొన్నట్లుగా అరుంధతీ రాయ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి ఎటువంటి లేఖ రాయలేదు. ఆ లేఖ ఒక కార్టూన్ ఆధారంగా తయారు చేయబడింది. కొద్దిపాటి మార్పులతో అనేక దేశాల్లో ఆ ప్రాంత వ్యక్తుల పేర్లతో చలామణి అవుతోంది. కావున, అరెస్ట్ చేయబడిన టెర్రరిస్ట్ ని సరిగ్గా చూస్కోవడంలేదంటూ అరుంధతీ రాయ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి లేఖ రాయడం మరియు దానికి బదులిస్తూ ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ మరొక లేఖ రాయడం అవాస్తవం.

అరెస్ట్ చేయబడిన ఒక టెర్రరిస్ట్ ని నేషనల్ కరెక్షనల్ సిస్టం ఫెసిలిటీస్ లో కేంద్రం సరిగ్గా చూస్కోవడం లేదంటూ రచయిత్రి అరుంధతీ రాయ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి లేఖ రాసిందని ఆ కథనంలో ఉంది. అంతేకాదు, దానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ బదులిస్తూ, బాధ్యతాయుత పౌరుల కోసం జాతీయ రక్షణ శాఖ వారు ‘LARK’ (లిబెరల్స్ ఆక్సేప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కిల్లర్స్) అనే ఒక ప్రొగ్రామ్ ని మొదలుపెట్టబోతుందనీ, ఆ కార్యక్రమం కింద అరుంధతీ రాయ్ తాను లేఖలో ప్రస్తావించిన టెర్రరిస్ట్ (మోహమ్మద్ అహ్మద్ బిన్ మహమూద్) యొక్క వ్యక్తిగత సంక్షేమం, రక్షణ, చికిత్స చూసుకోవాల్సి ఉంటుందని దోవల్ తన లేఖలో చెప్పినట్లుగా ఉంటుంది.

ఫేస్బుక్ లో అదే విషయం గతంలో 2016 లో ప్రచారం అయింది మరియు మళ్ళీ అదే విషయం ప్రస్తుతం కూడా షేర్ అవుతోంది. కథనంలో చెప్పిన విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు, అలాంటి విషయమే వివిధ దేశాల్లో ఆ ప్రాంత వ్యక్తుల పేర్లతో చలామణి అవుతున్నట్లుగా తెలిసింది. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, ఆ కథనాల్లో ఉన్న విషయం యొక్క వాస్తవికతని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దేనికీ కూడా విశ్వసనీయ సమాచారం లభించలేదు. ‘Snopes’ వారి కథనం ద్వారా, అలాంటి వార్త ఒక ‘సెటైర్’ అనీ, దానిని 2002 లో ‘జిమ్ హ్యూబర్’ యొక్క కార్టూన్ ఆధారంగా మొట్టమొదటిసారిగా రాసారనీ, తర్వాత కొద్దిపాటి మార్పులతో వివిధ దేశాల్లో ఆ ప్రాంత వ్యక్తుల పేర్లతో చలామణి అవుతోందని తెలిసింది.

చివరగా, టెర్రరిస్ట్ ని సరిగ్గా చూసుకోవాలని ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కి అరుంధతీ రాయ్ లేఖ రాయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll