Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేయలేదు; ప్రస్తుతం ఉన్న బోర్డును మాత్రమే రద్దు చేసింది

0

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనికి మద్దతుగా ‘టైమ్స్ నౌ (TIMES NOW)” న్యూస్ ఛానల్ న్యూస్ క్లిప్‌ను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసింది.

ఫాక్ట్(నిజం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేయలేదు. ప్రస్తుతం ఉన్న బోర్డును మాత్రమే రద్దు చేసింది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్‌లో వెతకగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డును రద్దు చేసిందని పేర్కొన్న  పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడఇక్కడఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో భాగంగా వైకాపా హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బోర్డులో సుపరిపాలన, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

ఈ కథనాల ప్రకారం, 30 నవంబర్ 2024న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ G.O.MS.No. 75 విడుదల చేసింది. ఈ జీవోలో గత ప్రభుత్వ హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ 11 మంది సభ్యులతో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తూ 21 అక్టోబర్ 2023న జారీ చేసిన G.O.MS.No. 47ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన G.O.MS.No. 75 ఇక్కడ చూడవచ్చు.

G.O.MS.No. 75 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డును రద్దు చేయడానికి గల కారణాలు కూడా వివరించింది. 2023 అక్టోబ‌ర్ 21న అప్పటి ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తూ జీవో నెంబ‌ర్ 47ని విడుద‌ల చేసింది. ఎన్నికైన స‌భ్యులు – ఎండీ. రుహుల్లా (ఎమ్మెల్సీ), హాఫీజ్ ఖాన్ (ఎమ్మెల్యే), షేక్ ఖాజా, నామినేటేడ్ స‌భ్యులు – ఖాదీర్ బాషా, మీరా హుహ్సేన్, షాఫీ అహ్మద్ ఖాద్రీ, షీరీన్ బేగం (ఐపీఎస్), బ‌ర‌క‌త్ అలీ, జే న‌జీర్ బాషా, ప‌ట‌న్ షాఫీ అహ్మద్‌, హాసీనా బేగంల‌తో వ‌క్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు.

అయితే ఈ నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు 01 నవంబర్ 2023న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వివిధ రకాల న్యాయపరమైన సమస్యల తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది. అలాగే, 29 నవంబర్ 2024న, ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బోర్డు సరిగా పనిచేయకపోవడం వంటి పలు సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. బోర్డు యొక్క చట్టబద్ధత మరియు చెల్లుబాటును సవాలు చేస్తూ పలు రిట్ పిటిషన్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు అయినట్లు ఈ జీవోలో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మరియు మంచి పాలనను, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడం మరియు వక్ఫ్ బోర్డు సజావుగా సాగేలా చూడటం కోసం G.O.MS.No. 47ను రద్దు చేస్తూ ఈ G.O.MS.No. 75 విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు స‌భ్యుల నియామకాలకు సంబంధించి 2023లో దాఖలైన WP నెం. 28422, 28479, 28440, మరియు 28467లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 01 నవంబర్ 2023న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇక్కడ చూడవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు శాశ్వతంగా రద్దు చేశారన్న వాదనలను వైరల్ కాగా, 1 డిసెంబర్ 2024న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అధికారిక ఫ్యాక్ట్‌చెక్ వింగ్ X(ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా,  వక్ఫ్ బోర్డ్‌ను ఎందుకు రద్దు చేసిందో వివరిస్తూ ఒక పోస్టు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా కొత్త వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తుందని కూడా పోస్ట్ పేర్కొంది. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేయలేదని స్పష్టమవుతోంది.

08 ఆగస్టు 2024న, వక్ఫ్ బోర్డు పనితీరును క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ యొక్క సమర్థ నిర్వహణ లక్ష్యంతో లోక్‌సభలో Waqf (Amendment) Bill, 2024, and Mussalman Waqf (Repeal) Bill, 2024, అనే రెండు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి. పార్లమెంటులో ఈ బిల్లులపై విస్తృత చర్చ జరిగిన తర్వాత, ఈ బిల్లులను అధ్యయనం మరియు సిఫార్సుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపారు (ఇక్కడఇక్కడ). ఇటీవల 28 నవంబర్ 2024న Waqf (Amendment) Bill పై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పదవీకాలాన్ని 2025 బడ్జెట్ సెషన్ చివరి రోజు వరకు పొడిగిస్తూ లోక్‌సభ తీర్మానం చేసింది (ఇక్కడ). వక్ఫ్ బిల్లులపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడఇక్కడఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేయలేదు. ప్రస్తుతం ఉన్న బోర్డును మాత్రమే రద్దు చేసింది. వక్ఫ్ బోర్డులోని లోపాలను పరిష్కరించి త్వరలో కొత్త వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll