హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్ 25 మార్చి 2025న అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కథనాలు ఉన్నాయి. రాజమండ్రికి వెళ్తుండగా NH-16 హైవేపై ప్రమాదం జరిగిందని (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఈ కథనాల సారాంశం. అయితే తన మృతిపై కొంత మంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హైవేపై ఆగివున్న ట్రక్ దగ్గర కొందరు పగడాల ప్రవీణను కొడుతున్నట్లు కనిపిస్తున్న దృశాలంటూ, అతన్ని ప్లాన్ చేసి హత్య చేశారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణను హత్య చేసినట్లు చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలకు, క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి ఎలాంటి సంబంధం లేదు. 25 మార్చి 2025న జరిగిన ప్రవీణ్ మరణం కంటే ముందు నుండే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, అందులో హషీం ఖాన్ (@HASIM_KHAN_5939) అనే ఇన్‌స్టాగ్రామ్ వాటర్‌మార్క్ కనిపించింది. దీని ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతని పేరు వెతికితే, ఇదే వీడియోను (ఆర్కైవ్ లింక్) హషీం ఖాన్ 08 మార్చి 2025న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించాం. అంటే, ఈ వీడియో 25 మార్చి 2025న జరిగిన పగడాల ప్రవీణ్ మృతికి ముందే ఇంటర్నెట్‌లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ‘ఇది ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే’ అని, ‘ట్రక్ బ్రేక్‌డౌన్ కారణంగా చిక్కుకున్న డ్రైవర్లను దొంగలు దోచుకుంటున్నారు’ అంటూ పేర్కొన్నాడు.
ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డ్ చేసారో మేము కచ్చితంగా నిర్ధారించలేకపోయినప్పటికీ, ఉన్న ఆధారాల ప్రకారం ఇది 25 మార్చి 2025న పగడాల ప్రవీణ్ మృతికి చాలా ముందే ఇంటర్నెట్‌లో ఉన్నట్లు కచ్చితంగా చెప్పొచ్చు. ఈ మృతిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. డీఎస్పీ దేవ్ కుమార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసి, ఆధారాలు సేకరించడం, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడం, మరణానికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోస్టుమార్టం రిపోర్ట్ కోసం వేచి ఉండాలని సూచించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
చివరిగా, పాస్టర్ పగడాల ప్రవీణ్‌ను చంపిన దృశ్యాలు అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.