27 సెప్టెంబర్ 2025న తమిళనాడులోని కరూర్ జిల్లాలో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో కనీసం 41 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, ఈ ఘటనలో 39 మంది మృతి చెందడానికి పోలీసులే కారణం అని, పోలీసులు జనాలను కొట్టడం మొదలుపెట్టినప్పుడే ఈ సమస్య వచ్చిందని నటుడు రజినీకాంత్ చెప్పారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటకు కారణం పోలీసులే అని నటుడు రజినీకాంత్ చెప్తున్నప్పటి వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో మే 2018 నాటిది. మే 2018లో తూత్తుకుడి కాల్పులలో నిరసనకారులు చనిపోయినప్పుడు రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియో చూపుతుంది. కరూర్ తొక్కిసలాటకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 31 మే 2018లో పలు మీడియా సంస్థలు యూట్యూబ్‌లో అప్లోడ్ (ఇక్కడ & ఇక్కడ) చేసినట్లు గుర్తించాం. మే 2018లో తమిళనాడులోని తూత్తుకుడిలో నిరసనకారులపై జరిగిన కాల్పులపై రజినీకాంత్ ఈ వీడియోలో మాట్లాడడం చూడవచ్చు.

తూత్తుకుడి కాల్పులలో 13 మంది చనిపోయిన ఘటనపై రజినీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, “….పోలీసులపై దాడి జరిగిన తర్వాతే ఈ సమస్య మొదలైంది. అక్కడి సంఘ వ్యతిరేక శక్తులు పోలీసులపై దాడి చేశారు…” అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్త కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. పై ఆధారాలను బట్టి, వైరల్ వీడియోకి కరూర్ తొక్కిసలాటలో ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

అలాగే, కరూర్ ఘటనపై రజినీకాంత్ ఇటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు లేవు. కరూర్ ఘటన తనని తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
చివరిగా, కరూర్ తొక్కిసలాటకు పోలీసులే కారణమని రజినీకాంత్ చెప్పారంటూ సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.