17 అక్టోబర్ 2025న నిజామాబాద్‌లో ప్రమోద్ కుమార్ అనే పోలీస్ కానిస్టేబుల్‌ని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ షేక్ రియాజ్, 20 అక్టోబర్ 2025న నిజామాబాద్‌లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను, పోలీసుల నుండి తుపాకీ లాక్కొని వారిపై దాడి చేసి పారిపోవడానికి ప్రయతించాడని, అతన్ని నివారించడానికి, పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడని 20 అక్టోబర్ 2025న తెలంగాణ డీజీపీ ‘X’ ద్వారా తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఒక అంబులెన్స్ వెనుక కొందరు పరిగెత్తి, అందులో ఉన్న మృతదేహాన్ని తీసుకుంటున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నిన్న నిజాంబాద్ లో ఎన్‌కౌంటర్‌లో అయిన రియాజ్(అంట) గాని మృతదేహానికి వాళ్ళు ఇస్తున్న విలువ చూడండి. చచ్చినవాడు టెర్రరిస్టు అయినా దేశద్రోహి అయినా ఎవరైనా వారికి సంబంధం లేదు. వాడు ముస్లిం అయితే అంతే వాళ్లంతా ఒకటవుతారు. అన్ని మతాలు సమానం అనే భ్రమలో ఉన్నవాళ్లు ఈ వీడియో చూడండి.,’ అని చెప్తూ ఈ వీడియోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: నిజామాబాద్ కానిస్టబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతదేహాన్ని తీసుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలను చూపిస్తున్న వీడియో ఇది.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో చిత్తూరు జిల్లాలోని పలమనేరులో 16 అక్టోబర్ 2025న కల్యాణరేవుల జలపాతంలో దూకి గల్లంతు అయిన యూనస్ అనే యువకుడు మృతదేహాన్ని చూడటానికి తన బంధువులు, మిత్రులు ఆసుపత్రికి తరలి వచ్చిన దృశ్యాలను చూపిస్తుంది. షేక్ రియాజ్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో 20 అక్టోబర్ 2025న మరణించాడు, వైరల్ వీడియో 18 అక్టోబర్ 2025 నుంచి ఇంటర్నెట్‌లో ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, షేక్ రియాజ్ మృతదేహాన్ని చూడటానికి లేదా తీసుకెళ్లడానికి వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు చాలా మంది జనం వచ్చారని చెప్తూ అవే దృశ్యాలతో కూడిన వార్తా కథనాలు మాకు ఏవి లభించలేదు.
వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియోలో కనిపిస్తున్న భవనం, ఆంధ్రప్రదెశ్‌లోని పలమనేరులో ఉన్న ప్రాంతీయ వైద్యశాల అని ఒక క్లూ మాకు దొరికింది.

ఈ ఆసుపత్రి గురించి ‘Palamaner News’ అనే యూట్యూబ్ ఛానల్ వారు అప్లోడ్ చేసిన ఒక వీడియోలో కనిపిస్తున్న భవనం, వైరల్ వీడియోలో కనిపిస్తున్న భవనం మాకు ఒకే లాగా అనిపించాయి (కట్టడం ఉన్న విధానం మరియు పెయింటింగు వల్ల).

దీన్ని వెరిఫై చేయడానికి, ఈ ఆసుపత్రి ఉన్న ప్రదేశాన్ని మేము గూగుల్ మ్యాప్స్ ద్వారా చూడగా, ‘Palamaner News’ వారి వీడియోలో ఉన్న భవనం, గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న పలమనేరు ప్రాంతీయ వైద్యశాల ఫోటో భవనం ఒకేలా ఉన్నాయని మాకు తెలిసింది

దీని ఆదరంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి మేము ఇంటర్నెట్‌లో వెతుకగా, వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాకు అదే ‘Palamaner News’ వారి యూట్యూబ్ ఛానల్‌లో లభించింది. దీన్ని వారు 18 అక్టోబర్ 2025న ‘యూనిస్ ను చూసేందుకు ఏరియా ఆసుపత్రికి భారీగా చేరుకున్న స్నేహితులు,బంధువులు | PALAMANER NEWS’ అనే టైటిల్‌తో అప్లోడ్ చేశారు.
ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా, చిత్తూరు జిల్లాలోని పలమనేరులో 16 అక్టోబర్ 2025న యూనస్ అనే యువకుడు కల్యాణరేవుల జలపాతంలో దూకి గల్లంతు అయ్యాడని చెప్తున్న కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.

తన మృతదేహం దొరికాక, తన స్నేహితులు, బంధువులు ఏరియా ఆసుపత్రికి వచ్చారని చెప్తూ ‘Palamaner News’ వారు ఆ వీడియో రిపోర్టును చేసి 18 అక్టోబర్ 2025న అప్లోడ్ చేశారు. దీన్ని నిజామాబాద్ రౌడీ షీటర్ షేక్ రియాజ్ మరణానికి ముడిపెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదనంగా, ఈ వీడియోను పోలిన దృశ్యాలు ఉన్న మరో వీడియో మాకు ‘CHANDRA CREATIONS-PALMANER’ అనే యూట్యూబ్ ఛానల్‌లో దొరికింది.
ఇక్కడ గమనించవలిసిన ఇంకో విషయం ఏమిటంటే పోలీస్ ఎన్‌కౌంటర్‌లో రియాజ్ 20 అక్టోబర్ 2025న మరణించాడు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), కానీ వైరల్ అవుతున్న వీడియో మాత్రం 18 అక్టోబర్ 2025 నుంచే ఇంటర్నెట్‌లో ఉంది.
రియాజ్ మరణించిన తర్వాత, తన మృతదేహాన్ని చూడటానికి ప్రజలు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత భారీ ఎత్తున తరలి వచ్చారా, అని తెలుసుకివడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌తో మేము ఫోన్ ద్వారా మాటడము. అయితే, తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు వచ్చారు కానీ భారీ ఎత్తున ఒక ఊరేగింపు లాగా ఏమీ రాలేదు అని ఆయన మాతో అన్నారు.
కావున, నిజామాబాద్ కానిస్టబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతదేహాన్ని చూడటానికి భారీ ఎత్తున ముస్లింలు తరలి వచ్చారని చెప్తూ ఒక సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు

