Fake News, Telugu
 

2025 నవంబర్‌లో మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో జరిగిన నిరసన ర్యాలీ దృశ్యాలంటూ తమిళనాడుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

18 నవంబర్ 2025న, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా, అతని భార్య రాజే సహా పలువురు మావోయిస్టులు హతమయ్యారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే, 19 నవంబర్ 2025న జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ సాంకేతిక కార్యక్రమాల్లో కీలకంగా ఉన్న టెక్ శంకర్ (అలియాస్ జోగారావు) సహా పలువురు మావోయిస్టులు హతమయ్యారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో “కేరళలో మావోయిస్ట్ నాయకుల హత్యకు నిరసన ర్యాలీ” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్‌లోని వీడియోలో, ఎర్ర చొక్కా, ఖాకీ ప్యాంటు ధరించిన వ్యక్తులు మార్చ్ చేస్తూ ర్యాలీగా వెళ్లడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల నవంబర్ 2025లో జరిగిన మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో జరిగిన నిరసన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో కేరళకు సంబంధించింది కాదు. ఈ వీడియో 02 ఏప్రిల్ 2025 నుండి 06 ఏప్రిల్ 2025 వరకు జరిగిన CPI(M) పార్టీ 24వ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా, 06 ఏప్రిల్ 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన రెడ్ వాలంటీర్ మార్చ్‌ను చూపిస్తుంది. అలాగే, ఇటీవల నవంబర్ 2025లో జరిగిన మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో ఇలాంటి నిరసన ర్యాలీ జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే,  వీడియోలోని వ్యక్తులు తమిళంలో నినాదాలు చేయడం మనం గమనించవచ్చు. అలాగే, పలు దుకాణాల బోర్డులు, రోడ్డు పక్కన ఉన్న బోర్డులు తమిళంలో ఉండటం  మనం గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఈ వీడియో కేరళకు సంబంధించినది కాదని స్పష్టమవుతోంది.

తదుపరి ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే పోలి ఉన్న వీడియో ఒకటి లభించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న అదే ప్రాంతాన్ని మనం ఈ వీడియోలో కూడా చూడవచ్చు. ఈ వీడియోను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) CPI(M), తమిళనాడు విభాగం వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 09 ఏప్రిల్ 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో ఏప్రిల్ 2025లో జరిగిన CPI(M) పార్టీ 24వ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించింది అని తెలిసింది.

వైరల్ వీడియోలోని దృశ్యాలను ఈ CPI(M) పార్టీకి సంబంధించిన వీడియోతో పోల్చి చూస్తే, ఈ రెండు వీడియోలు ఒకే ర్యాలీని చూపిస్తున్నాయని మనం నిర్ధారించవచ్చు. 

తదుపరి ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, 02 ఏప్రిల్ 2025 నుండి 06 ఏప్రిల్ 2025 వరకు CPI(M) పార్టీ 24వ కాంగ్రెస్ సమావేశాలను తమిళనాడులోని మధురైలో నిర్వహించారు. ఈ సమావేశాల సందర్భంగా, 06 ఏప్రిల్ 2025న రెడ్ వాలంటీర్ మార్చ్‌ను నిర్వహించారు. ఈ రెడ్ వాలంటీర్ మార్చ్‌కు సంబంధించిన వీడియోను మధురై ఎంపీ, CPI(M) నాయకుడు ఎస్ వెంకటేశన్ ఆయన X(ట్విట్టర్)లో షేర్ చేశారు. అలాగే ఈ రెడ్ వాలంటీర్ మార్చ్‌కు సంబంధించిన పలు వీడియోలను CPI(M) అధికారిక ఇంస్టాగ్రామ్ పేజీలో కూడా మనం చూడవచ్చు.

అలాగే ఈ వీడియోలో ఒక దుకాణంపై “ముత్తుపండి మహల్ కూల్డ్రింక్స్” అని రాసి ఉండటం మనం చూడవచ్చు. దీని ఆధారంగా మధురైలోని విమానాశ్రయం-మటుతవాని రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఈ దుకాణాన్ని గూగుల్ మ్యాప్స్‌లో జియోలొకేట్ చేసాము. వీటన్నిటి ఆధారంగా ఈ వైరల్ వీడియో 06 ఏప్రిల్ 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన రెడ్ వాలంటీర్ మార్చ్‌ను చూపిస్తుంది అని మనం నిర్ధారించవచ్చు.

అలాగే, ఇటీవల నవంబర్ 2025లో జరిగిన మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో నిరసన ర్యాలీలు జరిగినట్లు కూడా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. అయితే, మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.

ఇంతకుముందు కూడా ఇదే వీడియో ఇదే క్లెయింతో వైరల్ కాగా, ఈ వీడియోకు కేరళకు సంబంధం లేదని చెప్తూ Factly ప్రచురించిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2025 నవంబర్‌లో మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో జరిగిన నిరసన ర్యాలీ దృశ్యాలంటూ తమిళనాడుకు సంబంధించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll