Fake News, Telugu
 

ప్రధాని మోదీ ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇటీవల అన్నారని సంబంధంలేని 2019 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు

0

నా యొక్క మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను – ఇటలీ ప్రధాని’ అని క్లెయిమ్ చేస్తూ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇటాలియన్ భాషలో ప్రసంగం చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో, తనకు ప్రధానమంత్రి మోదీ నుంచి ఆమోదం వస్తే, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తానని ఇటలీ ప్రధాని మెలోని ఇటీవల అన్నారు.

ఫ్యాక్ట్(నిజం): ఈ విధమైన వ్యాఖ్యలు ఇటలీ ప్రధాని మెలోని చేయలేదు. వైరల్ అవుతున్న వీడియో, 2019లో ఐరోపా ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఎలక్షన్ ప్రచార సభలో మెలోని ప్రసంగంలోని చిన్న క్లిప్. ఈ క్లిప్‌లో తను ప్రధాని మోదీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము.  పహల్గామ్‌లో 22 ఏప్రిల్ 2025న జరిగిన ఉగ్రవాద దాడిపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారని మాకు తెలిసింది. కానీ ప్రధాని మోదీ ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని మెలోని అన్నట్లు మాకు ఎటువంటి ట్వీట్ కానీ, ఈ వాదనకు రుజువుగా వార్తా కథనాలు కానీ మాకు లభించలేదు.

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఈ వీడియో యొక్క అన్‌క్రాప్డ్ వెర్షన్ మాకు యూట్యూబ్‌లో దొరికింది. వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ వీడియో యొక్క 00:13 మార్క్ దగ్గర నుంచి మ్యాచ్ అవుతున్నాయి. 

ఈ వీడియోని 14 ఏప్రిల్ 2019న ‘Vista Agenzia Televisiva Nazionale’ అనే ఇటాలియన్ మీడియా సంస్థ తమ అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్‌ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. దీని బట్టి ఈ వీడియోకి 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి ఎటువంటి సంబంధం లేదని మనకి స్పష్టం అవుతుంది.  వీడియో యొక్క వివరణ ప్రకారం, 14 ఏప్రిల్ 2019న ట్యూరిన్‌లో జరిగిన Fratelli d’Italia(FDI) పార్టీ యొక్క 2019 ఐరోపా ఎన్నికల ప్రచార సభలో జార్జియా మెలోని ఈ ప్రసంగం చేశారు.

తన ప్రసంగాన్ని యూట్యూబ్‌లో ఉన్న ట్రాన్సలేట్ సదుపాయం ఉపయోగించి చూడగా, ఇందులో తను మాట్లాడుతూ ఫాబియో ఫాజీయో అనే వ్యక్తి పారిస్ రాజధాని అని అన్నాడు అని చెప్పారు. ఇలా అన్నందుకు తనని ఖండిస్తూ, ఇటలీ రాజధాని రోమ్ అని మెలోని అన్నారు. అలాగే, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ నగరాన్ని పెట్టాలని తను ఐరోపాకు చెప్తానని ఈ ప్రసంగంలో మెలోని అన్నారు. 

ఈ సభకు సంబంధించిన మరి కొన్ని వీడియోలను  ‘Vista Agenzia Televisiva Nazionale’ వారు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే, ఈ ప్రసంగం యొక్క పూర్తి వీడియో మాకు Fratelli d’Italia వారి అధికారిక వెరిఫైడ్ యూట్యూబ్‌ ఛానల్‌లో దొరికింది. ఈ ప్రసంగంలో తాను ఎక్కడా కూడా ప్రధాని మోదీ గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ మాట్లాడలేదు. 

ఇదే విషయంపై 2019లో ‘today’ అనే ఇటాలియన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.  ‘Globe Eye News’ అనే వార్త సంస్థ ఈ వీడియో క్లిప్ ‘X’లో పోస్ట్ చేస్తూ, యూరోపియన్ యూనియన్ రాజధానిగా రోమ్ ఉండాలి అని అన్నారని పేర్కొన్నారు.14 ఏప్రిల్ 2019న ట్యూరిన్‌లో జరిగిన  Fratelli d’Italia(FDI) పార్టీ ఎన్నికల ప్రచార సభ గురించి ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలని మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.   

చివరగా, ప్రధాని మోదీ ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇటీవల అన్నారని సంబంధంలేని 2019 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll