22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. కాకపోతే, 25 ఏప్రిల్ 2025న తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన కొత్త ప్రకటనలో, TRF పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం లేదని, అంతకు ముందు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని తెలిపింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ).
పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి పాక్ సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది, భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది.
ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌ను ఎగతాళి చేస్తున్నాడు అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఇందులో తను ఒక వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగుతూ, “హా… హా… నాకు నీళ్లు కావాలి. నాకు సహాయం చేయి, నాకు నీళ్లు కావాలి. సహాయం చేయి” అని అనడం మనం చూడవచ్చు. సింధు జల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్‌ను ఎగతాళి చేశాడంటూ ఈ వీడియో షేర్ చేయబడుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌ను ఎగతాళి చేస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో ఫిబ్రవరి 2016 నాటిది, ఒక అమెరికా ఎన్నికల ర్యాలీలో తీసింది. 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగానికి ప్రతిస్పందనగా, తన 2016 ప్రత్యర్థి మార్కో రూబియో వింతగా/ ఇబ్బందికరంగా నీరు తగిన సంఘటనను డోనాల్డ్ ట్రంప్ ఈ ర్యాలీలో ఎగతాళి చేశాడు. దీనికి, పహల్గామ్ ఉగ్రవాద దాడికి లేదా సింధూ జల ఒప్పందంతో ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియో యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్ మాకు లభించింది. ఈ వీడియోని 27 ఫిబ్రవరి 2016న NBC న్యూస్ యొక్క ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేశారు.
26 ఫిబ్రవరి 2016న టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, డోనాల్డ్ జె. ట్రంప్ తన ప్రత్యర్థి మార్కో రూబియోని ఈ విధంగా ఎగతాళి చేశాడు అని పోస్ట్ యొక్క వివరణలో ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని ఇది స్పష్టం చేస్తుంది. తర్వత, ఈ ఫేస్‌బుక్ పోస్ట్ నుండి ఆధారాలను తీసుకొని, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి ఇంటరెనెట్లో వెతకగా, ఈ సంఘటనపై వచ్చిన అనేక వార్తా కథనాలు మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఈ కథనాల ప్రకారం, 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా యొక్క స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగానికి స్పందిస్తున్నప్పుడు, మార్కో రూబియో (అమెరికా రాజకీయ నాయకుడు) ఇబ్బందికరంగా నీళ్లు తాగిన సంఘటనను డొనాల్డ్ ట్రంప్ ఎగతాళి చేయడం, ఈ వీడియో చూపిస్తుంది.
ఈ వీడియో ఫిబ్రవరి 2016లో టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీకి సంబంధించినది. 2016 ప్రెసిడెన్షియల్(అధ్యక్ష) ప్రైమరీల సమయంలో ఇద్దరి మధ్య జరిగిన విమర్శల్లో భాగంగా, రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో రూబియో చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ట్రంప్ ఈ విధంగా చేశాడని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
అమెరికాలో, స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం అనేది దేశ చట్టసభ్యులు, పౌరులకు దేశం యొక్క ప్రస్తుత స్థితి, కీలక విజయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి తెలియజేయడానికి అధ్యక్షుడు చేసే వార్షిక ప్రసంగం. 2013లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ప్రసంగం చేశారు, ఆ తర్వాత ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరపున సెనేటర్ మార్కో రూబియో ప్రతిస్పందన ఇచ్చారు.
2016 ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ఎగతాళి చేసింది మార్కో రూబియో యొక్క 2013 ప్రతిస్పందన ప్రసంగ సమయంలో జరిగిన ఒక సంఘటనను. ఆ ప్రసంగం యొక్క వీడియోను 13 ఫిబ్రవరి 2013న ది న్యూయార్క్ టైమ్స్ వారు తమ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. రూబియో, తన ప్రసంగాన్ని మధ్యలో ఆపివేసి అసౌకర్యంగా లేదా వింతగా నీళ్లు తాగడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇదే సన్నివేశాన్ని తర్వాత ట్రంప్ 2016లో ఎగతాళి చేశాడు.
చివరగా, భారతదేశం సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్‌ను అపహాస్యం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క వీడియో అని, సంబంధం లేని 2016 నాటి వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.