2024 లోక్ సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించడానికి భారత దేశాన్ని ఆఫ్గనిస్తాన్ లాగా మార్చడానికి జిహాదీలు ప్రణాళిక చేస్తున్నారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: 2024 లోక్ సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించడానికి భారత దేశాన్ని ఆఫ్గనిస్తాన్ లాగా మార్చడానికి జిహాదీలు ప్రణాళిక చేస్తున్నారు, వారి ప్రకటన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఇది 2024లో తీసిన వీడియో కాదు. ఈ వీడియో సోషల్ మీడియాలో 2019 నుండే ఉంది. ఇందులో ఉన్న వ్యక్తి పేరు సైద్ కబెర్, ఈయన పాకిస్థాన్‌లోని ఖైబర్ జిల్లాలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI) పార్టీ కార్యదర్శి. ఈ వీడియోకి, భారత్ లో జరుగుతున్న 2024 లోక్ సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో 6 ఆగస్ట్ 2019లో అప్లోడ్ చేసిన ఇదే వీడియో లభించింది. వీడియో కింద వివరణలో ‘ట్రైబల్ పఖ్తూన్ నాయకుడు సయ్యద్ కబీర్ అఫ్రిదీ భారతదేశానికి చివరి హెచ్చరిక’ అని చూడవచ్చు. దీనిని బట్టి, ఇది ఒక పాత వీడియో అని, దీనికి 2024లో భారత్ లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని అర్ధం అవుతుంది.
ఈ వివరాలతో, ఇంటర్నెట్‌లో కీ వర్డ్స్ తో వెతికితే ఇదే వీడియో 25 ఫిబ్రవరి 2019లో ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి కనిపించింది. ఇదే ఫేస్‌బుక్ పేజీలో వేరే యాంగిల్ లో తీసిన ఇలాంటి వీడియోనే మరొకటి కనిపించింది. ఈ వీడియో కింద వివరణలో ‘నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ట్రైబల్ నాయకుడు సయ్యద్ కబీర్ అఫ్రిదీ హెచ్చరిక’ అని పేర్కొని ఉంది. ఈ ఫేస్‌బుక్ పేజీ గురించిన వివరణలో, ఇతని పేరు సైద్ కబెర్ అని, ఈయన పాకిస్థాన్‌లోని ఖైబర్ జిల్లాలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం పార్టీ జనరల్ సెక్రటరీ అని ఉంది.
ఇదే వీడియోని ‘ఆజ్ తక్’, జమ్మూ & కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకి ముడి పెడుతూ 14 సెప్టెంబర్ 2019లో రిపోర్ట్ చేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఆగస్టు 2019లో రద్దు చేస్తే, ఈ వీడియో సోషల్ మీడియాలో 2019 ఫిబ్రవరి నుండే ప్రచారం అవుతోంది.
గతంలో కూడా ఈ వీడియోను, ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత, ఒక పాకిస్తానీ తాలిబాన్ భారత్‌ని హెచ్చరిస్తున్న వీడియో అని తప్పుగా షేర్ చేసారు.
చివరగా, పాకిస్తాన్‌కి చెందిన ఒక JUI పార్టీ కార్యదర్శి మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పాత వీడియోను 2024 లోక్ సభ ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.