Fake News, Telugu
 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్నది సిఖ్ మతస్థుడే

0

పౌరసత్వ చట్టానికి నిరసనగా చేసిన ప్రదర్శనలో సిక్కు వేషంలో విధ్వంసానికి దిగిన ముస్లిం వ్యక్తిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పౌరసత్వ చట్టానికి నిరసనగా చేసిన ప్రదర్శనలో సిక్కు వేషంలో విధ్వంసానికి దిగిన ముస్లిం వ్యక్తి.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన 2011 లో పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. వీడియోలో సిక్కు వేషంలో ఉన్నది ముస్లిం వ్యక్తి కాదు, తను సిక్కు మతస్తుడే. ఒక సిక్కు తలపాగాని తీసినందుకు ఇద్దరు పంజాబ్ పోలీసు ఆఫీసర్లను 2011 లోనే సస్పెండ్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

తెలంగాణ బీజేపీ ఎం.పీ. ధర్మపురి అరవింద్ కూడా ‘సర్దార్ జి వేషంతో మోసం.. పౌరసత్వ ప్రదర్శనల నిజస్వరూపం’ అని పెట్టి అదే వీడియోని పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసారు.

అందరూ అది ఫేక్ న్యూస్ అన్న తర్వాత తను రాసింది ఎడిట్ చేసి, ‘గతంలో ప్రదర్శనల ముసుగులో జరిగిన మోసాలు.. ఇలాంటివి ఇప్పుడు కూడా ఎన్నో జరుగుతున్నాయి.. పోలీసులు , ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..’ అని రాసారు (ఆర్కైవ్డ్).

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో చాలా వస్తాయి. అదే వీడియోని యూట్యూబ్ లో 2011 లోనే ‘Sikh Youth’s turban removed 28 March 2011 @ Mohali Stadium Mohali Stadium by a Punjab Police’ (తెలుగు – ‘28 మార్చ్, 2011 న మొహాలీ స్టేడియం దగ్గర సిక్కు వ్యక్తి తలపాగా తీసిన పంజాబ్ పోలీసు’) అని టైటిల్ పెట్టి పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు.

ఆ ఘటన గురించి గూగుల్ లో వెతకగా, ‘The Times of India’ వారి ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. నిరసనలో పాల్గొన్న ఒక సిక్కు వ్యక్తి తలపాగా తీసేసినందుకు 2011 లోనే ఇద్దరు పంజాబ్ పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్టు ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సిక్కు వ్యక్తి తలపాగా తీసేసినందుకు నిరసనగా కొన్ని సిక్కు సంఘాలు 31 మార్చ్ 2011 న నిరసనలు నిర్వహించినట్టు ఇంకో ఆర్టికల్ లో చదవొచ్చు.

బీజేపీ ఎం.పీ. ధర్మపురి అరవింద్ మార్చి పెట్టిన పోస్టు కూడా తప్పే, ఎందుకంటే ‘ప్రదర్శనల ముసుగులో జరిగిన మోసాలు’ అని రాసారు. అక్కడ ఎటువంటి మోసం లేదు. వీడియోలోని వ్యక్తి సిక్కు మతస్తుడే. తను సిక్కు మతస్తుడు కాబట్టే తన తలపాగా తీసేసినందుకు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసారు.

చివరగా, ‘సిక్కు వేషంలో విధ్వంసానికి దిగిన ముస్లిం.. పౌరసత్వ ప్రదర్శనల నిజస్వరూపం’ అంటూ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వీడియోలోని వ్యక్తి సిక్కు మతస్తుడే.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll