Fake News, Telugu
 

‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమయ్యాక ఏపీలో మహిళలు బస్సు సీట్ల కోసం కొట్టుకుంటున్నారంటూ తెలంగాణకు చెందిన పాత వీడియోని షేర్ చేస్తున్నారు

0

15 ఆగష్టు 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్రవ్యాప్తంగా పలు రకాల APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఈ నేపథ్యంలో, విజయనగరం నుంచి కొత్తవలస వెళ్తున్న బస్సులో మహిళా ప్రయాణికులు సీట్ల కోసం కొట్టుకున్నారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A group of people in a bus  AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమయ్యాక విజయనగరం నుంచి కొత్తవలస వెళ్తున్న బస్సులో సీట్ల కోసం కొట్టుకున్న మహిళల వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో కనీసం జనవరి 2024 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న TGSRTC బస్సులో సీట్ల కోసం మహిళలు గొడవ పడ్డారంటూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో (ఇక్కడ & ఇక్కడ) కనీసం జనవరి 2024 నుంచి అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం. మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న TGSRTC బస్సులో జరిగినట్లు పలు వార్తా కథనాలు లభించాయి. తెలంగాణలో డిసెంబర్ 2023లో మహాలక్షి పథకం ప్రారభమైన తర్వాత ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

అయితే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ‘స్త్రీ శక్తి’ పథకం 15 ఆగష్టు 2025 నుంచి అమలులోకీ వచ్చింది. దీన్ని బట్టి, వైరల్ వీడియో ‘స్త్రీ శక్తి’ పథకం అమలు కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉందని స్పష్టమవుతుంది.

అదనంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఇటువంటి ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

అయితే, ఏపీలో కూడా ‘స్త్రీ శక్తి’ పథకం అమలు అయ్యాక ఇలాంటి ఘటనలు జరిగినట్లు కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) చేశాయి.

చివరిగా, ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమయ్యాక ఏపీలో మహిళలు బస్సు సీట్ల కోసం కొట్టుకుంటున్నారంటూ తెలంగాణాకు చెందిన పాత వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll