మే 2025 భారత్-పాక్ వివాదం నేపథ్యంలో, కిరానా హిల్స్‌లో ఉన్న పాకిస్తాన్ అణు కేంద్రాన్ని భారతదేశం దాడి చేసిందని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడం మొదలైంది (ఇక్కడ, ఇక్కడ). 12 మే 2025న, భారత ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భారతదేశం కిరానా హిల్స్‌పై దాడి చెయ్యలేదు అని అన్నారు.
ఈ నేపథ్యంలో, కిరానా హిల్స్‌పై భారత్ చేపట్టిన దాడికి చెందిన దృశ్యాలంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కిరాణా హిల్స్.. ఇప్పుడు మీరు మీ తెలివితేటలు మరియు విచక్షణతో ఇది ఏమిటో అర్థం చేసుకుని ముగించండి.??భారతదేశం ఇలా చేస్తుందని బహుశా అమెరికాకు కూడా తెలియకపోవచ్చు’ అనే వివరణతో షేర్ చేయబడుతున్న ఈ వీడియో వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా కిరానా హిల్స్‌పై భారత్ చేపట్టిన దాడిని చూపిస్తున్న వీడియో
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో కనీసం మే 2015 నుంచి ఇంటర్నెట్లో ఉంది. దీనికి మే 2025 భారత్-పాక్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్‌లోని కిరాణా హిల్స్‌పై తాము దాడి చేయలేదని భారత్ స్పష్టం చేసింది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్,తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా మాకు ఇదే వీడియో ఉన్న 11 మే 2015 నాటి రెండు సోషల్ మీడియా పోస్టులు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ).
ఇది యెమెన్ దేశ రాజధాని సనా నగరంలో జరిగిన ఒక పేలుడుని చూపిస్తుంది అని ఒక ‘X’’ పోస్టులో ఒక వివరణ ఉంది. ఇదే వీడియోని ‘News of the Yemeni Revolution’ అనే ఒక ఫేస్‌బుక్ పేజి అప్లోడ్ (ఆర్కైవ్ లింక్) చేస్తూ ‘NYR | More of Nuqoum Mountain explosions. #Yemen #yf’ అనే వివరణ ఇచ్చారు.

దీన్ని క్లూగా తీసుకొని, ఈ వీడియో గురించి ఏమైనా వార్తా కథనాలు వచ్చాయా అని ఇంటర్నెట్లో వెతుకగా, యెమెన్ రాజధాని సనాపై, సౌదీ నేతృత్వంలో ఉన్న కూటమి, 11 మే 2015న వైమానిక దాడులు చేపట్టిందని పేర్కొన్న కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ కథనాల ప్రకారం, రాజధానికి ఉత్తర దిక్కున, హౌతీలకి విధేయులుగా ఉన్న కొన్ని సైనిక స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 90 మంది చనిపోగా, 300 మంది గాయాలపాలయ్యారు.కొన్ని కథనాల ప్రకారం ఈ దాడులు ‘Noqum Mountain’ ఉన్న ప్రదేశంలో జరిగింది (ఇక్కడ, ఇక్కడ).
వైరల్ వీడియోలో కనిపిస్తున్న భవనాలు, పర్వతాలు ఈ రిపోర్టులలో కూడా మనం చూడవచ్చు. కానీ, ఈ కథనాలలో వైరల్ అవుతున్న వీడియో లేదు. అంచేత, మేము వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాన్ని స్వతంత్రంగా నిర్ధారించ లేనప్పటికీ, ఈ వీడియో కనీసం మే 2015 నుంచి ఇంటర్నెట్లో ఉంది కాబట్టి, దీనికి మే 2025 భారత్-పాక్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు అని మనకు స్పష్టం అవుతుంది.
చివరగా, మే 2025 భారత్-పాకిస్థాన్ వివాదం నేపథ్యంలో కిరానా హిల్స్‌పై భారత్ చేపట్టిన దాడికి చెందిన దృశ్యాలంటూ 2015 నాటి పాత వీడియోని షేర్ చేస్తున్నారు.