“పోలిసుల మీద నుండి ట్రాక్టర్లను తీసుకెళ్తున్న రైతులు అని చెప్పుకొనే ఖాలిస్తాని తీవ్రవాదులు” అంటూ ర్యాలీలో ట్రాక్టర్ చక్రాల కింద ఉన్న పోలీసుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: పంజాబ్‌లో కొనసాగుతున్న రైతు నిరసనల మధ్య రైతులు పోలీసులపైకి ట్రాక్టర్‌ను ఎక్కించారు.
ఫాక్ట్(నిజం): 22 ఆగస్టు 2023న పంజాబ్ రాష్ట్రంలో వరదలు విధ్వంసం సృష్టించిన తరువాత పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడానికి పంజాబ్ నుండి రైతులు చండీగఢ్‌కు వెళ్తున్న సందర్భంలోని వీడియో ఇది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న రైతు నిరసనల నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటన కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, జర్నలిస్ట్ గగన్‌దీప్ సింగ్ Xలో అదే వీడియోను 21 ఆగస్టు 2023న షేర్ చేస్తూ, ‘సంగ్రూర్‌లోని లాంగోవాల్‌లో నిరసన తెలుపుతున్న రైతులకు మరియు పంజాబ్ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక రైతు ట్రాక్టర్ ట్రాలీ టైరు కింద పడి కాలు కోల్పోయాడు. చికిత్స పొందుతూ రైతు మరణించాడు మరియు ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు’ పోస్టు చేసినట్టు గమనించాం.
దీని గురించి కీ వర్డ్స్ ఉపయోగిస్తూ మరింత వెతికితే, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇదే వీడియోలోని స్క్రీన్ షార్ట్ షేర్ చేస్తూ ఒక కథనాన్ని 22 ఆగస్టు 2023న ప్రచురించడం గమనించం. పంజాబ్ రాష్ట్రంలో వరదలు విధ్వంసం సృష్టించిన తరువాత పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడానికి పంజాబ్ నుండి రైతులు చండీగఢ్‌కు వెళ్తున్నారని ఈ పత్రిక పేర్కొంది.
అంతే కాకుండా, సంగ్రూర్ పోలీస్ X ద్వారా ఇదే వీడియోను షేర్ చేస్తూ, ‘లాంగోవాల్‌లో ఒక నిరసనకారుడు మరణించాడు, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు’ అని పోస్టు చెయ్యటం గమనించాం.
చివరిగా, పాత వీడియోను ప్రస్తుతం 2024లో కొనసాగుతున్న రైతు నిరసనల మధ్య చోటు చేసుకున్నట్టు షేర్ చేస్తున్నారు.