తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వై.వీ. సుబ్బారెడ్డి సహా పలువురు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 30 సెప్టెంబర్ 2024న, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోతో కూడిన దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల చేపట్టిన నిరసనకు సంబంధించిన ఫోటో అని క్లెయిమ్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల చేపట్టిన నిరసనకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటో జూలై 2023 నాటిది. జూలై 2023లో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు చేపట్టారు. ఈ వైరల్ ఫోటో అప్పడు జరిగిన ఒక నిరసన ప్రదర్శనకు సంబంధించినది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 10 జూలై 2023న ఇదే ఫోటోను ‘YS Jagan Trends’ అనే ఒక X(ట్విట్టర్) ఖాతా షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ ఫోటోను “AP Volunteers ON,#PawanSaySorryToVolunteers” అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ ఫొటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, జూలై 2023లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) నిరసనగా వాలంటీర్లు చేపట్టిన ఒక నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫోటో అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
అలాగే తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల ఇలాంటి ఏదైనా నిరసన జరిగిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇలాంటి నిరసన ప్రదర్శనలు జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.
చివరగా, తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఫోటోకు చెప్పుల దండ వేశారు అంటూ సంబంధం లేని పాత ఫోటోను షేర్ చేస్తున్నారు.