“పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం ఇంకా పూర్తి అవ్వలేదు పాకిస్తాన్ తీవ్రవాదులు, ISI స్పాన్సర్ టెర్రరిస్టులను ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపుతామని హెచ్చరించిన – లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు తుపాకీలు పట్టుకుని మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉంది. ఈ వైరల్ వీడియోను 2022లో “లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్” అనే ఫేసుబుక్ పేజీ షేర్ చేసింది. అసలు వీడియోలోని ఆడియోను వేరే ఆడియోతో ఎడిట్ చేసి ఈ వైరల్ వీడియోను సృష్టించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఈ వీడియో యొక్క ఆడియో ఎడిట్ చేయబడినట్లు అనిపిస్తుంది. ఈ వీడియోలో ముసుగు ధరించిన వ్యక్తులు మొదట ఇంగ్లీష్ కాకుండా వేరే భాషలో మాట్లాడటం మనం చూడవచ్చు. టైమ్‌స్టాంప్ 00.20 నుండి వారు ఇంగ్లీషులో మాట్లాడుతున్న ఆడియోను మనం వినవచ్చు.
ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్), 04 ఫిబ్రవరి 2022న, “లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (Liberation Front AFG) ” అనే ఫేస్‌బుక్ పేజీ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము

ఈ ఫేస్‌బుక్ వీడియోలో ముసుగు ధరించిన వ్యక్తులు ఏమి చెబుతున్నారో తెలుసుకోవడానికి Google NotebookLM ఉపయోగించి వీడియోను పరిశీలించినప్పుడు, వారు ఈ వీడియోలో తాలిబాన్ అణచివేతను ఖండించారని, జర్నలిస్టులను హింసించడం, మహిళలను అణచివేయడం వంటి విషయాలను ప్రస్తావించారని, కానీ కాశ్మీర్, పాకిస్తాన్ లేదా పహల్గామ్ గురించి ప్రస్తావించలేదని మేము కనుగొన్నాము. అలాగే, ఈ అసలైన వీడియోలో వారు ఎక్కడా ఇంగ్లీషులో మాట్లాడలేదు. దీన్ని బట్టి అసలు వీడియోలోని ఆడియోను వేరే ఆడియోతో ఎడిట్ చేసి ఈ వైరల్ వీడియోను సృష్టించారని మనం నిర్ధారించవచ్చు.అంతేకాకుండా, ఈ వైరల్ వీడియో 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నందున పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ఈ వీడియో చూపించడం లేదని మనం నిర్ధారించవచ్చు.
‘లిబరేషన్ ఫ్రంట్ AFG’ గ్రూప్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ 2022లో ప్రచురింతమైన పలు కథనాలు మాకు లభించాయి (ఇక్కడ ,ఇక్కడ, & ఇక్కడ ). ఈ కథనాల ప్రకారం, ‘లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’ అనేది తాలిబాన్ వ్యతిరేక సంస్థ అని తెలిసింది, అలాగే ‘లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’ 2022లో తమ ఉనికిని తెలియజేయడానికి ఈ వీడియోను విడుదల చేసినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు ఈ వీడియోలో ఈ ఫ్రంట్ ISI వ్యతిరేక లేదా పాకిస్తాన్ వ్యతిరేక ప్రకటన చేసినట్లు పేర్కొనలేదు.

‘లిబరేషన్ ఫ్రంట్ AFG’ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన పోస్ట్‌లలో, వారి మ్యానిఫెస్టోలో ఎక్కడా భారతదేశానికి మద్దతుగా ఎటువంటి ప్రకటనలు మాకు కనిపించలేదు. ఈ పేజీలో చివరి పోస్ట్ 01 ఏప్రిల్ 2022న చేయబడింది.

అలాగే, 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే సంస్థ వీడియో విడుదల చేసినట్లు కూడా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.
చివరగా, 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినట్లు పేర్కొంటూ సంబంధం లేని 2022 నాటి వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.