‘చంద్రబాబు గారికి అవసరమైనప్పుడు వై ఎస్ రాజా రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెడతాడు’ అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కొడుకు రాజారెడ్డి రాజకీయ ప్రవేశం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఇలా అనడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అవసరమైనప్పుడు తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల చెప్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక ఎడిటెడ్ వీడియో. అసలు వీడియోలో వైఎస్ షర్మిల ‘అవసరమైనప్పుడు వైస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెడతాడు’ అని అన్నారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, Indian National Congress- Andhra Pradesh వారి ఫేస్‌బుక్ పేజీలో 8 సెప్టెంబర్ 2025న చేసిన ఒక లైవ్ స్ట్రీమ్ మాకు వైరల్ వీడియోను పోలిన దృశ్యాలు కనిపించాయి. వీడియోలోన. దీన్ని మనం 1:26:05 మార్క్ దగ్గర చూడవచ్చు.

వై ఎస్ షర్మిల కర్నూల్ మార్కెట్‌ను సందర్శించి, అక్కడ ఉల్లి రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకొని మీడియాతో మాట్లాడిన సంఘటనకు చెందిన స్ట్రీమ్ ఇది. తనతో పాటు తన కుమారుడు రాజారెడ్డి కూడా అక్కడకు వెళ్లాడు.
ఈ నేపథ్యంలో ఒక విలేఖరి తన కుమారుడు రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నాడని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అవసరమైనప్పుడు వైస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెడతాడు’ అని అన్నారు. అంతే కానీ చంద్రబాబు గారికి అవసరమైనప్పుడు వస్తాడని తను చెప్పలేదు. దీనిబట్టి, ఈ వీడియోలో ‘చంద్రబాబు గారికి’ అనే ఆడియోని జోడించి దీన్ని ఎడిట్ చేశారని మనకు అర్థం అవుతుంది. తను చేసిన ఈ వ్యాఖ్య గురించి వచ్చిన మీడియా కథనాలు మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చువరగా, చంద్రబాబుకి అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల అన్నారని ఒక ఎడిటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.