“రామయానానికి త్రేతా యుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృత యుగానికంటే ముందువి అని అంటే, ఇదంతా కట్టు కథ, పచ్చి అబద్ధం.. అంతే కాదు ఇదంతా Unscientific ” అని ప్రముఖ హిందూ మత గురువు చిన్న జీయర్ స్వామి చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: వేదాలు కృతయుగం కంటే ముందువి అనే వాదన ‘Unscientific’ అని చిన్న జీయర్ స్వామి అంటున్న వీడియో.
ఫాక్ట్(నిజం): భారతదేశంలో పుట్టినవాళ్ళు భారత జాతికి చెందినవారు అనే విషయాన్ని వివరిస్తూ, చిన్న జీయర్ స్వామి చేసిన ప్రవచనంలో నుంచి ఒక చిన్న భాగాన్ని దాని అసలు సందర్భం నుంచి తీసేసి ఎడిట్ చేసిన ఒక చిన్న క్లిప్ ఈ వీడియో. అసలు పూర్తి వీడియోలో ఆయన మాట్లాడుతూ, “….అప్పుడు మీరు చెప్పుకునే రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ రామాయణానికి త్రేతా యుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే, ఇదంతా కట్టు కథ, పచ్చి అబద్ధం.. అంతే కాదు ఇదంతా Unscientific. అని అంటారు(మన దేశ వాసులకి హిందువులు అని పేరు పెట్టినవారు).. మీరు సింధు, హిందూ అని పేరు పెట్టుకుంటే” అని అన్నారు. కాబట్టి,పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి మేము ఇంటర్నెట్లో దీని గురించి వెతుకాగా. వైరల్ వీడియోలో ఉన్న క్లిప్ యొక్క అసలు వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు లభించింది.

భారతదేశంలో ఉన్న వారందరు భరత వంశం నుంచి వచ్చిన వారిని, ఇక్కడ ఉండే మన జాతి పేరు భారత జాతి అనే విషయాన్ని జీయర్ స్వామి ఈ వీడియోలో చెప్పారు. ఇక్కడివారికి హిందువు అనే పేరు వేరే వాళ్ళు పెట్టారు అని వివరిస్తూ, సింధు లోయలో పుట్టిన వారిని ఉద్దేశిస్తూ కొంతమంది భారత దేశంలో ఉండే వారికి హిందూ అని పేరు పెట్టారు అని, కానీ మన దేశంలో ఉన్న వారు రకరకాల నదీ తీరాల్లో పుట్టారు కాబట్టి ఆ పేరు మనకి అందరికీ ఆపాదించడం సరి కాదు అని ఈ ప్రవచనంలో తను చెప్పారు.
ఒకవేళ ఆ పేరును మనం ఒప్పుకుంటే భారత జాతికి ఉన్న చరిత్ర మొత్తం ‘Zero’ అయిపోతుంది అని ఆయన వివరించారు. ఆ పేరును ఒప్పుకుంటే మన జాతి చరిత్ర 4000 సంవత్సరాల క్రితం వరకే పరిమితం అని మనం ఒప్పుకున్నట్లు అవుతుంది అని తను వాపోయారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న క్లిప్ మనం ఈ అసలు వీడియోలో ఇక్కడ చూడవచ్చు.
తను మాట్లాడుతూ “…. అప్పుడు మీరు చెప్పుకునే రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ రామాయణానికి త్రేతా యుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే, ఇదంతా కట్టు కథ, పచ్చి అబద్ధం.. అంతే కాదు ఇదంతా Unscientific. అని అంటారు(మన దేశ వాసులకి హిందువులు అని పేరు పెట్టినవారు).. మీరు సింధు, హిందూ అని పేరు పెట్టుకుంటే” అని అన్నారు. ఈ వాక్యం ఆఖర్లో తను వేరే వాళ్ళు ఇలా అంటారు అనే భాగాన్ని ఎడిట్ చేసి, చిన్న జీయర్ స్వామి వేదాల గురించి ఇలా అన్నారు అనే తప్పుడు అర్థం వచ్చేలాగా ఈ క్లిప్‌ని షేర్ చేస్తున్నారు.
ఈ విషయం పట్ల తన అభిప్రాయాన్ని గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో మరింత వెతకగా, ఇటీవల ఇండియా పేరును భారత్ అని మారుస్తున్నారు అని కొన్ని వార్తలు వచ్చినప్పుడు, గతంలో మాదిరిగానే, ఈ దేశానికి భారతదేశం అనే పేరు పెట్టడం హిందూ పురాణాల ప్రకారం సబబే అని చెప్పారు (ఇక్కడ, ఇక్కడ).

ఈ విషయాన్ని చిన్న జీయర్ స్వామి తన అధికారిక యూట్యూబ్ చానెల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేసారు.
చివరిగా, వేదాలు కృతయుగం కంటే ముందువి అనే వాదన ‘Unscientific’ అని చిన్న జీయర్ స్వామి అన్నారని అర్థం వచ్చేలాగా ఎడిట్ చేసిన వీడియో ఇది.