Fake News, Telugu
 

టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యానించారు అంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది

0

టీడీపీ నాయకుడు, నటుడు నందమూరి బాలకృష్ణ  ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “తెలుగుదేశం, జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం వైసీపీ ప్రభుత్వం, అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని కూలగొట్టే ఒక పాశుపత అస్త్రమే, వైసీపీ అనేది నిన్ను సంక్షేమ రాజ్యంలో చేరుస్తుంది, చీకటి నిండిన మీ బ్రతుకులో అద్భుతమైన వెలుగును ఇస్తుంది అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్న ” అని అన్నట్లు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నందమూరి బాలకృష్ణ ఒక బహిరంగ సభలో వైసీపీకి అనుకూలంగా, టీడీపీ-జనసేన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం):ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. టీడీపీ నాయకుడు, నటుడు బాలకృష్ణ 04 మార్చి 2024న పెనుగొండలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీని విమర్శించారు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేస్తు బాలకృష్ణ  వైసీపీకి అనుకూలంగా, టీడీపీ-జనసేన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోని గమనిస్తే, ఇది ఎడిట్ చేసిన వీడియో అని తెలుస్తుంది. ఈ వైరల్ వీడియోకి సంబంధించిన  మరింత సమాచారం కోసం పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని TV5 NEWS తమ యూట్యూబ్ ఛానెల్‌లో 04 మార్చి 2024 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల ఎన్నికల బహిరంగ సభకు సంబంధించింది అని తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు  టైంస్టాంప్ 12.46 వద్ద మొదలై, టైంస్టాంప్ 14.03 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, బాలకృష్ణ ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ “తెలుగుదేశం, జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనంమే, అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని కూలగొట్టే ఒక పాశుపత అస్త్రమే, చివరగా ఒక మాట చెప్తున్న ఓటర్ అన్న నువ్వు ఇప్పటి దాక నమ్మి ఎక్కింది వైసీపీ అనే కొయ్యా గుర్రాన్ని, నిన్ను మాయ చేసి మభ్యపెట్టి అటు ఇటు ఉపిందే గాన్ని అభివృధి చేయలేదు. తెలుగుదేశం-జనసేన కలయిక వాయు-మనో వేగాలతో పరుగులు తీసే పంచకళ్యాణి గుర్రం, అది నిన్ను సంక్షేమ రాజ్యంలో చేరుస్తుంది, చీకటి నిండిన మీ బ్రతుకులో అద్భుతమైన వెలుగును ఇస్తుంది అని తెలియజేసుకుంటూ…….. నేను సెలవు తీసుకుంటున్న” అని అన్నారు. దీన్ని బట్టి అసలైన వీడియోను ఎడిట్ చేస్తు బాలకృష్ణ  వైసీపీకి అనుకూలంగా, టీడీపీ-జనసేన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, బాలకృష్ణ వైసీపీని విమర్శించారు.

చివరగా, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ  వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యానించారంటూ ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll