Fake News, Telugu
 

ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎక్స్కవేటర్‌ను మోసుకెళ్తుందని ఒక ఎడిట్ చేయబడిన ఫోటోని షేర్ చేస్తున్నారు

0

05 ఆగష్టు 2025లో ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు వచ్చిన నేపథ్యంలో, ఈ విపత్తులో దెబ్బతిన్న ధరాళీ గ్రామానికి రోడ్డు మార్గంలో సంబంధాలు తెగిపోగా, సహాయక చర్యల కోసం భారత ఆర్మీ హెలికాప్టర్ ద్వారా జేసీబీ ఎక్స్కవేటర్‌ను అక్కడికి పంపిందని చెప్తూ చినూక్ హెలికాప్టర్ ఎక్స్కవేటర్‌ను మోసుకెళ్తున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఆగష్టు 2025 ఉత్తరాఖండ్ వరదల సహాయక చర్యల్లో భాగంగా ఎక్స్కవేటర్‌ను మోసుకెళ్తున్న చినూక్ హెలికాప్టర్.

ఫాక్ట్: ఇది ఎడిట్ చేయబడిన ఫోటో.అసలు ఫోటో అక్టోబర్ 2020లో CH 47 చినూక్ హెలికాప్టర్ ఒక హోవిట్జర్‌ను (ఫిరంగి వంటి యంత్రం) మోసుకెళ్లడాన్ని చూపుతుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో చినూక్ హెలికాప్టర్ల వాడకం గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన కొన్ని మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక శిబిరాలకు తరలించడానికి, జనరేటర్ వంటి సామాగ్రిని తరలించడానికి ఈ హెలికాప్టర్లను ఉపయోగించారని తెలిసింది. వీటిలో ఎక్కడా కూడా చినూక్ హెలికాప్టర్ల ద్వారా ఎక్స్కవేటర్‌ను మోసుకెళ్తున్నట్లు చూపే దృశ్యాలు కానీ సమాచారం కానీ లేదు.

ఇక వైరల్ ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్ ని గమనించగా ఇది ఎడిట్ చేయబడిన ఫోటోలాగా కనిపిస్తుంది. ఈ కోణంలో పరిశోధన జరపడం కోసం, వైరల్ ఫోటోలోని పై భాగాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు ఫోటో లభించింది. ఈ ఫోటోని కనీసం 2020 నుంచి వివిధ మీడియా సంస్థలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచురించాయి. ఫోటో వివరణలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం, ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో అక్టోబర్ 2020లో నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ దినోత్సవం సందర్భంగా రిహార్సల్స్ చేస్తున్న సమయంలో CH 47 చినూక్ హెలికాప్టర్ ఒక హోవిట్జర్‌ను (ఫిరంగి వంటి యంత్రం) మోసుకెళ్లడాన్ని చూపుతుంది.

ఇక వైరల్ ఫోటోని అసలు ఫోటోతో పోల్చగా, అసలు ఫొటోలోని హోవిట్జర్ స్థానంలో ఎక్స్కవేటర్ ఫోటోను పెట్టి ఎడిట్ చేసినట్లుగా చూడవచ్చు.

అలాగే వైరల్ ఫొటోలోని కింది భాగాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో 05 ఆగష్టు 2025లో ఉత్తరాఖండ్ వరదలకు ధ్వంసం అయిన ధరాళీ మార్కెట్ ప్రాంతాన్ని చూపుతుందని పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి. ఈ ఆధారాలను బట్టి, వైరల్ ఫోటో రెండు వేర్వేరు ఫోటోలను ఎడిట్ చేసి సృష్టించారని స్పష్టమవుతుంది.

అదనంగా, ఉత్తరకాశి జిల్లా పోలీసులు కూడా వైరల్ ఫోటో నకిలీదని స్పష్టం చేశారు (ఆర్కైవ్).

చినూక్ హెలికాప్టర్లు తయారు చేసే బోయింగ్ సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం, చినూక్ మోడల్ హెలికాప్టర్లు దాదాపు 12.5 టన్నుల బరువు వరకు మోసుకెళ్లగలవు. అయితే, ఎక్స్కవేటర్ యంత్రాల బరువు మోడల్‌ని బట్టి 8 టన్నుల నుంచి 37 టన్నుల వరకు ఉంటాయి.

చివరిగా, ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో చినూక్ హెలికాప్టర్ ఎక్స్కవేటర్‌ను మోసుకెళ్తుందని ఒక ఎడిట్ చేయబడిన ఫోటోని షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll