04 ఏప్రిల్ 2022న అప్పటి YSRCP ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను పునర్ విభజిస్తూ వాటి స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో TDP-JSP-BJP కూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పాటైన TDP కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా మార్చేందుకు కొత్తగా ఏర్పాటైన TDP నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఫాక్ట్(నిజం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన TDP నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. పైగా, నవంబర్ 2020లో పబ్లిష్ అయిన పలు వార్తకథనాలు ప్రకారం, 2020లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన కొరకు కమిటీని ఏర్పాటు చేయగా సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని ఇదే లిస్ట్ చక్కర్లు కొట్టినట్లు తెలసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో తెలిపినట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా మార్చేందుకు కొత్తగా ఏర్పాటైన TDP నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందా?అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఓకవేళ అలాంటి ప్రతిపాదనలు సిద్దం చేసి ఉంటే పలు మీడియా సంస్థలు కచ్చితంగా రిపోర్టు చేసి ఉండేవి.
తదుపరి ఈ వైరల్ కొత్త జిల్లాల లిస్టుకు సంబంధించిన సమాచారం కోసం మరింత వెతకగా ఈ లిస్టులో గల జిల్లాల పేర్లు మరియు సమాచరాన్ని రిపోర్ట్ చేస్తూ నవంబర్ 2020లో పబ్లిష్ అయిన పలు వార్తకథనాలు మాకు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 2020లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన కొరకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 2020లో సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని ఓ లిస్ట్ చక్కర్లు కొట్టింది.

నవంబర్ 2020లో సోషల్ మీడియాలో వైరల్ అయిన జాబితాతో ప్రస్తుతం వైరల్ అవుతున్న జాబితాలో జిల్లాల సంఖ్య, వాటి పేర్లను పోల్చి చూస్తే, రెండు జాబితాలు ఒకేలా ఉన్నాయని తెలుస్తుంది. దీన్ని బట్టి, నవంబర్ 2020లో సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని వైరల్ అయిన అదే జాబితా మళ్లీ షేర్ చేస్తున్నారని మనం నిర్థారించవచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా మార్చేందుకు కొత్తగా ఏర్పాటైన TDP నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది అంటూ గతంలో వైరల్ అయిన జాబితాను ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు.