“అయోధ్య, ఆలయానికి ఒక నెమలి వచ్చి రామ్ లల్లాను దర్శించుకుని రాముని పాదాలపై పూలమాల వేస్తుంది” అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఈ వీడియో అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహానికి నెమలి పూలమాల వేసిన నిజమైన సంఘటనను చూపిస్తుంది.
ఫాక్ట్ (నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. కాబట్టి ఈ పోస్టు తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలో పేర్కొన్నట్టుగా, అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహానికి నెమలి పూలమాల వేసినదా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు.
ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, వీడియోలో ‘Ash_saxena’ అనే వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. దీన్ని ఆధారంగా తీసుకొని ఇంటర్నెట్లో వెతికితే ఇది ఆశిష్ సక్సేనా అనే పేరు గల ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కు దారి తీసింది.

29 డిసెంబర్ 2025న ఆ హ్యాండిల్ లో వైరల్ వీడియోను షేర్ చెయ్యటం గమనించాం. ఈ పోస్టు వివరణలో #sora2 #sora అని రాయటం గమనించవచ్చు. అంటే, ఈ వైరల్ వీడియోను ‘Sora’ అనే AI టూల్ ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది.

తదుపరి, ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్ ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఇది AI ద్వారా రూపొందించబడిందని సూచించింది.

ఆశిష్ సక్సేనా (ash_saxena) ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను గమనించగా ఇతను ఒక ఫిల్మ్ మేకర్, AI క్రియేటర్ అని తెలుస్తుంది. ఈయన క్రియేట్ చేసిన వైరల్ వీడియో వంటి మరిన్ని వీడియోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహానికి నెమలి పూలమాల వేసిందంటూ ఒక AI-జనరేటెడ్ వీడియో షేర్ చెయ్యబడుతోంది.

