‘నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి (mars) పై శివలింగం కనుక్కున్నది, ఇది నాసా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దీన్ని పది నిమిషాల్లో తొలగించారు’ అని క్లెయిమ్ చేస్తూ ఒక ఫొటోని(ఇక్కడ,ఇక్కడ) సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. ‘దీనిపట్టే తెలుస్తుంది ఈ విశ్వమంతా హిందువులేదే అని ఒకప్పుడు మార్స్ కూడా అఖండ భారతలో భాగమే అమెరికన్స్ మన హిందూ మతం గురించి ఎన్నో దాచేస్తున్నారు’ అని క్లెయిమ్ చేస్తూ ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ ఫోటో వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: అంగారకుడిపై నాసా వారి క్యూరియాసిటీ రోవర్ ఈ శివలింగం ఫోటోని తీసింది.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్. అంగారకుడిపై శివలింగాన్ని గుర్తించినట్లు నాసా ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, నాసా వారి క్యూరియాసిటీ రోవర్ ఇటివల అంగారకుడిపై శివలింగాన్ని కనుగొందా అని వెరిఫై చేయడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, దీన్ని ద్రువీకరిస్తూ మాకు ఒక్క వార్తా కథనం కూడా దొరకలేదు. అలాగే ఈ ఫోటోని నాసా ట్వీట్ (ఇక్కడ, ఇక్కడ) చేసి డిలీట్ చేసింది అని చెప్తున్న ఈ వైరల్ పోస్టులు తప్ప, మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.
అలాగే, నాసా వారి అధికారిక వెబ్సైటులో కూడా, వారు అంగారకుడిపై శివలింగాన్ని కనుగొన్నట్టుగా ఎటువంటి సమాచారం లేదు. నాసా వారి క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై 2012లో ల్యాండ్ అయ్యింది. అంగారకుడి ఉపరితలంపై క్యూరియాసిటీ రోవర్ తీసిన రా(raw) ఫోటోలను నాసా తమ వెబ్సైటులో పెట్టింది, అందులో వైరల్ అవుతున్న ఫోటో లేదు.
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టూల్స్ ఉపయోగించి తయారు చేసిన ఫోటో అయి ఉండవచ్చు అనే అనుమానంతో, ఈ ఫొటోని AI-జనరేటెడ్ ఇమేజెస్‌ని డిటెక్ట్ చేసే టూల్స్(Hive & Sight Engine)లో చెక్ చేశాము. ఈ రెండు టూల్స్ ఈ ఫోటో AI-జనరేటెడ్ ఇమేజ్ అని తేల్చి చెప్పాయి (ఇక్కడ, ఇక్కడ).


చివరగా, నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై శివలింగం కనుక్కొంది అని ఒక AI-జనరేటెడ్ ఇమేజ్ తప్పుగా షేర్ చేస్తున్నారు.