ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి మండలం చౌడిపల్లి గ్రామంలో ఒక రైతు పొలంలో మానవ రూపంలో ఉన్న చిలకడదుంపలు పండాయని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. వీటిని చూడటానికి గ్రామస్థులు ఆసక్తిగా ఆ రైతు పొలానికి తరలి వెళ్తున్నారని కూడా షేర్ చేస్తున్నారు. మానవ ముఖం, చేతులు, కాళ్ల ఆకృతులు ఉన్న ఈ చిలకడదుంపలు గ్రామంలో చర్చనీయాంశం అయ్యిందని సోషల్ మీడియా యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఈ ఫొటోలో కనిపిస్తున్న మనిషి రూపంలో ఉన్న చిలకడదుంపలు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక రైతు పొలంలో పండాయి.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటో, నిజమైన చిలకడదుంపల ఫోటో కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక రైతు పొలంలో మానవ రూపంలో ఉన్న చిలకడ దుంపలు పండాయనే వాదనకు రుజువుగా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి మండలం చౌడిపల్లి గ్రామంలో వైరల్ ఫొటోలో కనిపిస్తున్నట్లుగా ఒక రైతు పొలంలో చిలకడ దుంపలు దొరికాయని చెప్తూ, మాకు ఎటువంటి వార్తా కథనాలు, వేరే ఆధారాలు లభించలేదు.
ఇక, ఈ ఫోటో గురించి మరిన్ని వివరాల కోసం ఇంటర్నెట్‌లో దాన్ని ఉపయోగించి ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. కానీ, ఈ సెర్చ్ ద్వారా, ఈ చిలకడదుంపలు నిజంగానే పొలంలో పండాయి అనే వాదనకు రుజువుగా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
అయితే, ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసినది అయి ఉంటుంది అని మాకు ఒక అనుమానం వచ్చింది. దీన్ని వెరిఫై చేయడానికి, హైవ్ అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి మేము చెక్ చేస్తే, ఇది AI-జనరేటెడ్ కంటెంట్ (96.7% స్కోర్) అని మాకు తెలిసింది.

చివరగా, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక రైతు పొలంలో మనుషుల రూపంలో ఉన్న చిలకడదుంపలు పండాయని చెప్తూ, AIతో తయారు చేసిన ఫోటో షేర్ చేస్తున్నారు.