తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమెల్యే హుమాయున్ కబీర్, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్న రేజీనగర్‌లో 6 డిసెంబర్ 2025న ‘బాబ్రీ మసీదు తరహా’ మసీదు యొక్క శంకుస్థాపన చేశాడు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నెలకొన్న నేపథ్యంలో, AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీతో కలిసి రాహుల్ గాంధీ ఈ మసీదు నిర్మాణంలో పాల్గొంటున్న దృశ్యం అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేయబడుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో శంకుస్థాపన అయిన ‘బాబ్రీ మసీదు తరహా’ మసీదు నిర్మాణంలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీల ఫోటో.
ఫ్యాక్ట్: ఇది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్ (చిత్రం). ఇది AI-జనరేటెడ్ ఇమేజ్ అని AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి. రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ ఈ మసీదు నిర్మాణంలో పాల్గొన్నారని చెప్పడానికి మాకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీలు పశ్చిమ బెంగాల్‌లో కడుతున్న ‘బాబ్రీ మసీదు తరహా’ మసీదు నిర్మాణంలో పాల్గొన్నట్లు మాకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు.
ఇక వైరల్ అవుతున్న ఈ ఫోటో గురించి మరిన్ని వివరాల కోసం దాన్ని ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా మాకు ఈ ఫోటో ఉన్న ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. అయితే, ఈ ఫోటోను మేము సరిగ్గా గమనించగా, ఫొటోలో కొన్ని అవకతవకలు మాకు కనిపించాయి. ఇందులో అసదుద్దీన్ ఒవైసీ చేతి వేళ్లు అసహజంగా ఉన్నాయి, అలాగే తన కుడి చేతి, మోచెయ్యి భాగం దగ్గర తనకు చిన్న చిన్న వేళ్లు ఉన్నాయి. వెనుక బ్యానర్ మీద ఉన్న ‘Babri Masjid’ అనే పదాల్లో ‘d’ అనే అక్షరం ముందు ఇటుకల పైన కనిపిస్తుంది. సాధారణంగా, ఇటువంటి అవకతవకలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలు, ఇమేజీలలో ఉంటాయి.

ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి, ఈ ఫోటోను హైవ్, wasitAI వంటి AI-కాంటెంట్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి చూసాము. ఇది AI-జనరేటెడ్ ఇమేజ్ అని అవి గుర్తించాయి (ఇక్కడ, ఇక్కడ).

అదనంగా, మాకు ఈ ఇమేజ్‌ను పోలిన ఇమేజ్ ఉన్న పోస్ట్ ఒకటి ‘ahmad_reza78692’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లభించింది. ఇది కూడా AI-జనరేటెడ్ ఇమేజ్. ఇతని పేజీలో ఇటువంటి AI-జనరేటెడ్ ఇమేజీలు చాలా ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ పశ్చిమ బెంగాల్‌లో నిర్మిస్తున్న ‘బాబ్రీ మసీదు తరహా’ మసీదు నిర్మాణంలో పాల్గొన్నారని చెప్తూ ఒక AI-జనరేటెడ్ ఇమేజ్ షేర్ చేస్తున్నారు.

