Fake News, Telugu
 

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన పార్టీలన్నిటికీ కనీసం ఒక్క ఎంపీ సీటైనా ఉంది

0

భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కోరుతూ దేశంలోని 20కి పైగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన నేపథ్యంలో, వాటిలోని 11 పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేదని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలలో 11 పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేదు.

ఫాక్ట్: అధికారిక గణాంకాల ప్రకారం పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 20 పార్టీలలో (ఎంఐఎంతో కలిపి) ప్రతి పార్టీకీ లోక్‌సభ మరియు రాజ్యసభలలో కలిపి కనీసం ఒక్క ఎంపీ సీటైనా ఉంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

మీడియా కథనాల ప్రకారం, ఈ ఆర్టికల్ రాసే సమయానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఐ(ఎం), సమాజ్ వాదీ పార్టీ మొదలైన 20 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. పార్లమెంటు అధికారిక వెబ్‌సైట్లో (ఇక్కడ & ఇక్కడ) ఇచ్చిన గణాంకాల ప్రకారం ఆయా పార్టీలకు లోక్‌సభ మరియు రాజ్యసభలో ఉన్న ఎంపీల సంఖ్యను ఈ క్రింద పట్టికలో చూడవచ్చు.

సంఖ్యపార్టీ పేరులోక్‌సభ సీట్లురాజ్యసభ సీట్లుమొత్తం సీట్లు
1కాంగ్రెస్ (INC)503181
2తృణమూల్ కాంగ్రెస్ (AITC)231235
3ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)241034
4జనతా దళ్ (యునైటెడ్) JD(U)160521
5అమ్ ఆద్మీ పార్టీ (AAP)011011
6నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)050409
7శివసేన (ఉద్ధవ్ థాక్రే)060309
8సిపిఐ020204
9సిపిఐ(ఎం)030508
10సమాజ్‌వాది పార్టీ (SP)030306
11రాష్ట్రీయ జనతా దళ్ (RJD)000606
12ముస్లిం లీగ్ (IUML)030104
13జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)010203
14నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC)030003
15కేరళ కాంగ్రెస్(ఎం)010102
16రివల్యూషనరీ  సోషలిస్ట్ పార్టీ (RSP)010001
17MDMK000101
18VCK010001
19రాష్ట్రీయ లోక్ దళ్ (RLD)000101
20ఎంఐఎం (AIMIM)020002
 మొత్తం ఎంపీ సీట్లు14597242

పై గణాంకాలను ఆధారంగా, పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన పార్టీలన్నిటికీ లోక్‌సభ మరియు రాజ్యసభలలో కలిపి కనీసం ఒక్క ఎంపీ సీటైనా ఉందని నిర్ధారించవచ్చు. ఈ పార్టీల మొత్తం(లోక్‌సభ & రాజ్యసభ) ఎంపీ సీట్లు 242.

చివరిగా, పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలలో 11 పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేదని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll