Fake News, Telugu
 

కార్లలో బెంజీన్ వాయువు విడుదల అవడానికి ఎయిర్ కండీషనర్ (AC) కారణం కాదు

0

కారు ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఎయిర్ కండీషనర్ (AC) ఆన్ చేయడం ద్వారా వాహనం లోపల క్యాన్సర్ వ్యాధిని కలిగించే బెంజీన్ వాయువు విడుదల అవుతుంది, అని సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. కారును నీడలో పార్క్ చేసినప్పుడు 400-800 మిల్లీ గ్రాముల బెంజీన్ పేరుకుంటుందని, అదే ఎండలో పార్క్ చేసినప్పుడు 2000-4000 మిల్లీ గ్రాముల బెంజీన్ వాయువు పేరుకుంటుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఈ బెంజీన్ వాయువు వాహనంలోని ఆటోమొబైల్ భాగాల నుండి విడుదలవుతుందని క్లెయిమ్ చేస్తున్నారు. కారులో ACని స్టార్ట్ చేసినప్పుడు అది చల్లని గాలి విడుదల చేసే ముందు ఇంజిన్ నుంచి వేడి గాలి కారులోకి వదులుతుందని, ఈ గాలిలో బెంజీన్ వాయువు ఉంటుందని తెలుపుతున్నారు. కారులో కూర్చున్న తరువాత వేడి ప్లాస్టిక్ వాసనను గమనించినట్లయితే, కొన్ని నిమిషాల పాటు కారు అద్దాలు తెరిచి ACని ఆన్ చేయాలనీ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కారు ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఎయిర్ కండీషనర్ (AC) ఆన్ చేయడం ద్వారా వాహనం నుండి క్యాన్సర్ వ్యాధిని కలిగించే బెంజీన్ వాయువు విడుదల అవుతుంది.

ఫాక్ట్ (నిజం): కారులో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం నుండి వివిధ రకాలైన విష వాయువులు విడుదల అవుతాయని, ఈ విష వాయువులలో బెంజీన్ కూడా ఒకటని కోరియాలో జరిపిన ఒక అధ్యయనంలో తెలిపారు. కాని, వాహనాలలో బెంజీన్ వాయువు విడుదల అవడానికి ముఖ్య కారణం ఆ వాహనంలోని ఇంధనం అని ఈ రీసెర్చ్ డాక్యుమెంట్లో స్పష్టం చేసారు. కార్లలో విడుదలయ్యే ఈ బెంజీన్ వాయువు ద్వారా కాన్సర్ సోకే అవకాశం చాలా తక్కువ అని ‘American Cancer Society’ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

బెంజీన్ వాయువు ద్వారా కాన్సర్ వ్యాధి సోకే అవకాశాలున్నట్టు ‘American Cancer Society’ మరియు ‘Centers for Disease Control and Prevention’ పబ్లిష్ చేసిన ఎడిషన్లలో రిపోర్ట్ చేసాయి. ఆ ఎడిషన్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, కొరియా అర్బన్ ప్రాంతాలలో వాహనాల (కార్లు మరియు బస్సులు) నుండి విడుదలయ్యే విష వాయువులు, ప్రయాణికులు పై ఎంత ప్రభావం చూపుతుందనే విషయం పై 2001లో అధ్యయనం జరిపినట్టు తెలిసింది. ఈ అధ్యయనానికి సంబంధించి పబ్లిష్ చేసిన డాక్యుమెంట్‌ని ఇక్కడ చూడవచ్చు. ఈ అధ్యయనంలో వాహనాల నుండి వెలువడే బెంజీన్ వాయువు గురించి వివరించారు.

కారులో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం నుండి వివిధ రకాలైన విష వాయువులు విడుదల అవుతాయని, ఈ విష వాయువులలో బెంజీన్ కూడా ఒకటని ఈ అధ్యయనంలో స్పష్టంగా తెలిపారు. ఈ విషవాయువులు విడుదల అవడానికి ముఖ్య కారణం వాహనంలోని ఇంధనం అని తెలిపారు. కొత్త కార్లతో పోలిస్తే పాత బడిన కార్లలో ఈ బెంజీన్ స్థాయి, సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ఈ బెంజీన్ వాయువు విడుదల స్థాయి శీతాకాలంలో ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తెలిపారు. ఆటోమొబైల్ భాగాల ద్వారా గానీ ఎయిర్ కండీషనర్ ద్వార బెంజీన్ వాయువు విడుదల అవుతుందని ఈ అధ్యయనంలో ఎక్కడా తెలుపలేదు.

పార్కింగ్ చేసిన వాహనాల నుండి వెలువడే హానికరమైన వాయువలకి సంబంధించి 2007లో జర్మనీలో ఒక అధ్యయనం నిర్వహించినట్టు తెలిసింది.  “Toxicity of Parked Motor Vehicle Indoor Air” అనే టైటిల్ తో పబ్లిష్ చేసిన ఈ రీసెర్చ్ డాక్యుమెంట్‌ని ఇక్కడ చూడవచ్చు. ఈ అధ్యయనంలో భాగంగా ఒక కొత్త కారు, మూడు సంవత్సరాలు పాత కారుని 150 ఫారెన్‌హీట్ డిగ్రీల ఎండలో ఉంచారు. ఈ వాహనాల లోపల విడుదలైన గాలి మాలిక్యూల్లని మనుషులకు, జంతువులకు అందించారు. పాత వాహనంతో పోలిస్తే కొత్త వాహనంలో విడుదలైన గాలి ప్రయాణికులపై తక్కువ ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం ద్వారా స్పష్టతకొచ్చారు. కొత్త కారులో దాగి ఉన్న ఈ గాలిని పీల్చడం ద్వారా రోగనిరోధక శక్తి పై స్వల్ప ప్రభావం, అలెర్జీ లాంటి లక్షణాలు వచ్చినట్టు ఇందులో తెలిపారు. కార్లలో విడుదలయ్యే బెంజీన్ స్థాయి వల్ల కాన్సర్ వ్యాధి సోకుతుందనే వాదనని ‘American Cancer Society’ కొట్టి పారేసినట్టు ‘Snopes’ వెబ్సైటు ఈ మెసెజ్‌కు సంబంధించి పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది.

చివరగా, కారు ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఎయిర్ కండీషనర్ (AC) ఆన్ చేయడం ద్వారా బెంజీన్ వాయువు విడుదల అవుతున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ మెసేజ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

Share.

About Author

Comments are closed.

scroll