28 అక్టోబర్ 2025, అర్ధరాత్రి 11.30 దాటాక, కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో మొంథా తుఫాను తీరాన్ని తాకింది. మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి (ఇక్కడ, ఇక్కడ). మొంథా తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో, “శాటిలైట్‌లో కనిపించిన ‘మొంథ’ తుఫాన్ తీవ్రత..!” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఇదే వీడియోను, “భయంకరమైన మహాసముద్ర సింక్‌హోల్ కెమెరాలో బంధించబడింది” అని చెప్తూ మరికొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజమైనవా? లేదా AI జనరేట్? అని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ‘మొంథా’ తుఫాన్ యొక్క శాటిలైట్ దృశ్యాలు/ సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక సింక్ హోల్ దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించబడ్డాయి.ఈ వైరల్ వీడియో 13 జూలై 2025న టిక్‌టాక్‌లో ‘dr.vea’ అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో వివరణలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఈ వీడియో రూపొందించినట్లు యూజర్ పేర్కొన్నారు. అలాగే, ఈ వీడియోలోని దృశ్యాలను AI ద్వారా రూపొందించబడ్డాయని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ వీడియోను భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిందా? లేదా? అని తెలుసుకోవడానికి మేము IMD అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) పరిశీలించగా, ఈ వీడియోను IMD విడుదల చేయలేదని తెలిసింది. అలాగే ఈ వీడియో ‘మొంథా’ తుఫానుకు సంబంధించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ‘మొంథా’ తుఫానుకు సంబంధించి IMD విడుదల చేసిన శాటిలైట్ దృశ్యాలను ఇక్కడ & ఇక్కడ, ఇతర సంస్థలు విడుదల చేసిన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.
ఇకపోతే ఈ ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్), 13 జూలై 2025న టిక్‌టాక్‌లో ‘dr.vea’ అనే యూజర్ అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఈ వీడియో రూపొందించినట్లు యూజర్ పేర్కొన్నారు.


అలాగే, ఈ పేజీ (@dr.vea) వివరణలో కూడా ఈ పేజీ AI సహాయంతో రూపొందించిన వీడియోలు/దృశ్యాలు పోస్టు చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఛానెల్‌లో మనం ఇలాంటి AI జనరేటెడ్ వీడియోలను చాలా చూడవచ్చు.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 99.9% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

ఇంతకుముందు కూడా ఇదే ‘dr.vea’ టిక్‌టాక్ పేజీ షేర్ చేసిన మరొక వీడియో సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక నిజమైన గొయ్యి(సింక్ హోల్)ను చూపిస్తుంది అంటూ వైరల్ కాగా, ఆ వీడియో AI జనరేటెడ్ అని చెప్తూ Factly ఫాక్ట్-చెక్ కథనాన్ని ప్రచురించింది.
చివరగా, ‘మొంథా’ తుఫాన్ శాటిలైట్ దృశ్యాలు అంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.


