ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకునే దిశగా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ అణు, సైనిక ప్రదేశాలు లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను చేసింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’కు కౌంటర్‌గా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3’ని ఇరాన్ ప్రారంభించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు లక్ష్యంగా వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది (ఇక్కడ, ఇక్కడ). ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్ లోని అమెరికన్ ఎంబసీపై పడింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని అమెరికన్ అంబాసిడర్ మైక్ హకేబీ ధ్రువీకరించారు. 16 జూన్ 2025,ఇజ్రాయెల్ టెహ్రాన్‌లో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఛానల్ IRIB ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ ప్రాణభయంతో పరుగులు పెట్టింది. రోజురోజుకు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, “జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలు” అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఈ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు. ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’కు కౌంటర్‌గా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3’ని ఇరాన్ ప్రారంభించింది. టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు లక్ష్యంగా వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. అయితే, ఈ వైరల్ వీడియోలు ఇటీవల జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించినవి కావు. ఈ వీడియోలు AI ద్వారా రూపొందించబడ్డాయి. Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఈ వైరల్ వీడియోలు AI ద్వారా రూపొందించబడ్డాయని నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వీడియో-1:
ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై ఇరాన్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలంటూ ఈ క్రింది వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియో ప్రారంభంలో, ఒక బహుళ అంతస్తుల భవనం మంటల్లో కాలిపోతూ ఉండగా, రోడ్డుపై చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా వ్యక్తులు నడుస్తుండడం, అలాగే ఇజ్రాయెల్ జెండా ఎటువంటి ఆధారం (సపోర్ట్) లేకుండా గాలిలో ఎగురుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.
తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Hive, Cantilux వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియో 98.2% AI-జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. ఈ వైరల్ వీడియో 86% AI-జనరేటెడ్ కావచ్చని Cantilux ఫలితాన్ని ఇచ్చింది.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, టిక్‌టాక్‌లో ఇదే వీడియోను ఓ యూజర్ షేర్ చేసినట్లు మేము గుర్తించాము. ఈ టిక్‌టాక్ వీడియో వివరణలో కూడా ఈ వీడియో AI-జనరేటెడ్ అని పేర్కొనబడింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

వీడియో-2:
ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలంటూ ఈ క్రింది వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ ఈ వీడియో నిజమైనది కాదనీ, ఇది AI-జనరేటెడ్ కావచ్చని సూచిస్తున్నాయి.
ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడిన ఈ వీడియో యొక్క పలు అన్ క్రాపెడ్ (Uncropped) వీడియో లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోలో కుడివైపు క్రింద భాగంలో “Veo” అనే వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. ఈ వాటర్‌మార్క్ ఈ వైరల్ వీడియోను గూగుల్ Veo AI మోడల్‌ను ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

అంతే కాదు, గూగుల్ AI మోడల్స్ వాడి జెనరేట్ చేసిన ఫోటోలు , వీడియోలను గుర్తుపట్టే గూగుల్ వారి ‘సింథ్ ID’ టూల్ కూడా ఈ వీడియో AI వాడి చేసింది అని ఫలితం ఇచ్చింది.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Hive, Cantilux వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియో 98.5% AI-జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. ఈ వైరల్ వీడియో 80% AI-జనరేటెడ్ కావచ్చని Cantilux ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

వీడియో-3:
ఇజ్రాయెల్‌పై దాడులను వెంటనే ఆపమని ఇరాన్‌ను వేడుకుంటున్న ఒక ఇజ్రాయెల్ సైనికుడిని దృశ్యాలంటూ ఈ క్రింది వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఈ వీడియోలో కుడివైపు క్రింద భాగంలో “Veo” అనే వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. ఈ వాటర్‌మార్క్ ఈ వైరల్ వీడియోను గూగుల్ Veo AI మోడల్‌ను ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Hive, Cantilux వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియో 99.8% AI-జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. ఈ వైరల్ వీడియో 80% AI-జనరేటెడ్ కావచ్చని Cantilux ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.


చివరగా, ఈ వైరల్ వీడియోలు జూన్ 2025లో ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించినవి కావు. ఈ వీడియోలు AI ద్వారా రూపొందించబడ్డాయి.