Deepfake, Fake News, Telugu
 

ఆపరేషన్ సింధూర్‌లో నాశనమైన పాకిస్తానీ ఎయిర్ బేస్ దృశ్యాలంటూ ఒక AI-జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఒక యుద్ధ విమాన స్థావరాన్ని తలపిస్తున్న ఒక స్థలంలో కొన్ని దెబ్బతిన్న విమానాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలను చూపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది 7 మే 2025న భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో నాశనమైన ఒక పాకిస్తాన ఎయిర్ బేస్ యొక్క వీడియో అని యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఆపరేషన్ సింధూర్‌లో నాశనమైన పాకిస్తానీ ఎయిర్ బేస్ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని మొదటగా ‘3amelyon’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేశారు. తన పేజీలో ఇటువంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో ఆపరేషన్ సింధూర్‌లో దెబ్బ తిన్న పాకిస్తానీ ఎయిర్ బేస్‌కి చెందినది అని చెప్తూ మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. అలాగే, పాకిస్తానీ యుద్ధ స్థావరాలపై భారత దళాలు దాడి చేసిన దృశ్యాలను ప్రదర్శించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోలలో కూడా వైరల్ పోస్టులో కనిపిస్తున్న దృశ్యాలు లేవు.

ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా ఈ వీడియోని మొదటగా 19 మే 2025న ‘3amelyon’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేశారని మేము తెలుసుకున్నాము.

అరబిక్ భాషలో ఉన్న ఈ యూజర్ బయోలో ఆర్టిఫిషియల్ ‘ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేస్తున్న తిరుగుబాటు’ అన్న అర్థం వచ్చే వాక్యం ఉంది. అలాగే, పాలస్తీనా ప్రస్తావన కూడా బయోలో రాసి ఉంది.  

వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని యుద్ధ విమానాలపై ఇజ్రాయెల్ జెండాపై ఉండే యూదుల మత చిహ్నం ‘స్టార్ ఆఫ్ డేవిడ్’ ఉండటం మేము గమనించాము. అలాగే, కొన్ని విమాన రెక్కల పైన అర్థం పర్థం లేని కొన్ని పదాలు ఉన్నాయి, ఇలాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన దృశ్యాలలో సహజంగా ఉంటాయి.

ఇదే విషయాన్ని పరిశీలించడానికి, ఈ వీడియోని AI-జనరేటెడ్ వీడియోలను, ఫోటోలను పసిగట్టే ఆన్లైన్ టూల్ అయిన ‘cantilux’లో చూసాము. తమ ఎనాలిసిస్ రిపోర్టులో, ఇది AI-జనరేటెడ్ వీడియో అవ్వడానికి 99% అవకాశం ఉందని వచ్చింది (ఆర్కైవ్ లింక్). 

చివరగా, ఆపరేషన్ సింధూర్‌లో నాశనమైన పాకిస్తానీ ఎయిర్ బేస్ దృశ్యాలంటూ AI-జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll