Fake News, Telugu
 

అదాని గ్రూప్ ఈ వ్యవసాయ ఆధారిత కంపెనీలను 2019 కన్నా ముందే స్థాపించింది.

0

కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకురావడానికి సంవత్సరం ముందు అదాని గ్రూప్ చాలా వ్యవసాయ ఆధారిత కంపెనీలు రిజిస్టర్ చేయించింది అని చెప్తూ, ఈ కంపెనీల లిస్ట్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకురావడానికి సంవత్సరం ముందు అదాని గ్రూప్ చాలా వ్యవసాయ ఆధారిత కంపెనీలు రిజిస్టర్ చేయించింది.

ఫాక్ట్(నిజం): కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పోస్టులో చెప్తున్న ఏ ఒక్క కంపెనీ కూడా 2019లో స్థాపించబడలేదు. ఈ కంపెనీలన్నీ 2019 కన్నా ముందే స్థాపించబడ్డాయి. ఒక వ్యక్తి అదాని గ్రూప్ కి చెందిన పలు వ్యవసాయ ఆధారిత కంపెనీలు లలో డైరెక్టర్ గా నియామకమైన తేదీల వివరాలను అదాని వ్యవసాయ ఆధారిత కంపెనీలు స్థాపించిన తేదీలుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పోస్టులో చెప్తున్న ఏఒక్క కంపెనీ కూడా 2019లో స్థాపించబడలేదు. పోస్టులో చెప్తున్న కంపెనీలన్నీ 2019 కన్నా ముందే స్థాపించబడ్డాయి. అందులో ఒక కంపెనీ 2006లోనే స్థాపించబడింది. ఇంకా ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం పోస్టులో చెప్పిన కంపెనీలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని అదాని గ్రూప్ వ్యవసాయ ఆధారిత కంపెనీలు 2019 కన్నా ముందే స్థాపించబడ్డాయి.  

పోస్టులో ఉన్న డైరెక్టర్ వివరాలకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా, భారత దేశంలోని అన్ని కంపెనీల డేటా సేకరించే  InstaFinancials అనే ఒక కంపెనీ వెబ్సైటులో పోస్టులో ఉన్న వివరాలకి సంబంధించిన సమాచారం దొరికింది. ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం పోస్టులో చెప్పింది ఒక వ్యక్తి అదాని గ్రూప్ కి చెందిన వేరే వ్యవసాయ ఆధారిత కంపెనీలతో అసోసియేట్ అయిన మరియు ఆ కంపెనీలలో డైరెక్టర్ గా నియామకం అయిన తేదీల వివరాలు. దీన్నిబట్టి ఈ వ్యక్తి వేరే అదాని గ్రూప్ కంపెనీలలో డైరెక్టర్ గా నియామకం అయిన తేదీలను అదాని గ్రూప్ వ్యవసాయ ఆధారిత కంపెనీలు స్థాపించిన తేదీలు తప్పుగా అర్ధం చేసుకున్నారని కచ్చితంగా చెప్పొచ్చు.

కార్పొరేట్ వ్యవసాయానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ వ్యవసాయ ఆధారిత కంపెనీలను అదాని గ్రూప్ 2019 కన్నా ముందే నెలకొల్పింది.

Share.

About Author

Comments are closed.

scroll