Fake News, Telugu
 

‘ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్రలో 3500 టన్నుల బంగారం లభ్యం’ అనేది ఫేక్ వార్త

0

ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్రలో 3500 టన్నుల బంగారం లభ్యం అయ్యిందని చెప్తూ చాలా మంది సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. మూడు వేల టన్నులకు పైగా బంగారం ఉన్నట్టు ప్రముఖ వార్తాసంస్థలు కూడా ప్రచురించాయి. ఆ ఆర్టికల్స్ ని కేంద్ర మంత్రి కూడా ట్వీట్ (ఆర్కైవ్డ్) చేసాడు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్రలో 3500 టన్నుల బంగారం లభ్యం.  

ఫాక్ట్ (నిజం): సోన్‌భద్ర జిల్లలో సొంపహారిలో కేవలం సుమారు 160 కేజీల బంగారం వరకు మాత్రమే రాబొట్టచ్చని తమ అంచనాలో తేలినట్టు ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారు తెలిపారు. ‘సోన్‌భద్రలో 3500 టన్నుల బంగారం లభ్యం’ అని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కూడా వారు వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

‘సోన్‌భద్రలో 3500 టన్నుల బంగారం లభ్యం’ అని వార్తాసంస్థలు కూడా ప్రచురించడంతో,  సోషల్ మీడియాలో వివిధ రకాలుగా పలువురు పోస్ట్ చేసారు. ‘నా రాముడు సర్వ శుభంకరుడు, అయోధ్యలో రామాలయ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించగానే యూపీలో 3500 టన్నుల బంగారు గనులు ఇచ్చాడు ఆ రాష్ట్రానికి’, అని కొందరు పోస్ట్ చేస్తే, ‘దేవుడు అంటే రాముడు లాగా దర్జాగా ఉండాలి గాని ఏడుపు మొహంతో ఏంటి ,అయోధ్య రామమందిరం కట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తే , తిరిగి శ్రీరామచంద్రుడు వెల కట్టలేని ,మోయలేని కొండంత బంగారం ఇచ్చాడు’ అని మరికొందరు పోస్ట్ చేసారు. దొరికిన బంగారం విలువ 12 లక్షల కోట్లని కూడా కొందరు పోస్ట్ చేసారు.

అయితే, ‘సోన్‌భద్రలో 3500 టన్నుల బంగారం లభ్యం’ అని తాము ప్రకటించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారు తెలిపారు. సోన్‌భద్ర జిల్లలోని సొంపహరి లో కేవలం సుమారు 160 కేజీల బంగారం వరకు మాత్రమే రాబొట్టచ్చని తమ అంచనాలో తేలినట్టు వారు ట్వీట్ చేసారు.

సోన్‌భద్రలోని సోన పహారీ ప్రదేశంలో టన్నుకి 3.03 గ్రాముల బంగారం వచ్చేలా సుమారు 53 వేల టన్నుల ఓర్ ఉందని 1998-2000 మధ్యలో నిర్వహించిన అన్వేషణ లో తేలినట్టు ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారి వివరణలో చదవవొచ్చు. టన్నుకి 3.03 గ్రాముల బంగారం కాబట్టి, 53 వేల టన్నుల ఓర్ నుండి సుమారు 160 కేజీల బంగారం (53000 x 3.03 / 1000) వస్తుంది. 160 కేజీల బంగారం గురించి తాజాగా కాదు, 2000 లోనే తెలిసినట్టు ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారు రిలీజ్ చేసే ‘బ్రీఫింగ్ బుక్’ లో కూడా చూడవొచ్చు. సోన్‌భద్రలోని గుర్ పహార్ ప్రదేశంలో కూడా ఓర్ దొరికినా, వాటిల్లో బంగారం డెన్సిటీ తక్కువ.

సోన్‌భద్ర జిల్లాలోని అనేక ప్రదేశాలలో ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారు బంగారం నిల్వల కోసం తవ్వకాలు చేసారు. కాకపోతే అంతటా కూడా తక్కువ క్వాలిటీ మరియు తక్కువ లభ్యత ఉండడంతో కొన్ని చోట్ల ఆ తవ్వకాలను ఆపేసారు. ఇక్కడి నిల్వలు ఆర్థికంగా లాభసాటి కాకపోవడం కూడా ఒక కారణమే.

పబ్లిక్ డొమైన్ లో ఉన్న అధికారిక డాకుమెంట్లు పరిశీలిస్తే చాలు, ఉత్తరప్రదేశ్ అధికారులు చెప్పిన నెంబర్లలో నిజం లేదని తెలుస్తుంది. కానీ, ఆ నెంబర్లను వెరిఫై చేయకుండా అన్ని ప్రముఖ వార్తాసంస్థలు ప్రచురించాయి. ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారు ఇచ్చిన వివరణను కూడా వార్తాసంస్థలు తర్వాత ప్రచురించినప్పటికీ, అప్పటికే తప్పుడు వార్త చాలా వైరల్ అయ్యింది.  

చివరగా, ‘ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్రలో 3500 టన్నుల బంగారం లభ్యం’ అనేది ఫేక్ వార్త.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll