Fake News, Telugu
 

RBI రిలీజ్ చేసిన సెలవుల లిస్టు ప్రకారం అక్టోబర్ 2021లో బ్యాంకులు 21 రోజులు సెలవులు తీసుకోవడం లేదు

0

2021 అక్టోబర్ నెలలో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 21 రోజులు సెలవులు తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ‘ఉదయం’ న్యూస్ పోర్టల్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌ని ఈ పోస్టులో షేర్ చేస్తూ, పండగలు, ఆదివారాలు, శనివారాలతో (2 మరియు 4వ) కలిపి బ్యాంకులు అక్టోబర్ నేలలో 21 రోజులు సెలవులు తీసుకోబోతున్నట్టు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్ద్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2021 అక్టోబర్ నెలలో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 21 రోజులు సెలవలు తీసుకోనున్నాయి.

ఫాక్ట్ (నిజం): RBI రిలీజ్ చేసిన 2021 సెలవుల లిస్టు ప్రకారం అక్టోబర్ నెలలో ఆదివారాలు, శనివారాలతో (2, 4వ) కలిపి బ్యాంకులకు మొత్తంగా 21 రోజులు సెలవులు ప్రకటించింది. కానీ, శని, ఆదివారాలు కాకుండా మిగతా 14 సెలవులు అన్ని ప్రాంతాల బ్యాంకులకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరుపుకొనే పండగలని దృష్టిలో ఉంచుకొని RBI ఈ సెలవులని ప్రకటించింది. RBI సెలవుల లిస్టులో ఏ ఒక్క ప్రాంతంలో కూడా 21 రోజులు సెలవులు ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.     

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం RBI వెబ్సైటులో వెతికితే, RBI రిలీజ్ చేసిన సెలవుల లిస్టు ప్రకారం అక్టోబర్ నెలలో ఆదివారాలు, శనివారాలతో (2, 4వ) కలిపి బ్యాంకులకు మొత్తంగా 21 రోజులు సెలవులు ప్రకటించిందని తెలిసింది. కానీ, శని, ఆదివారాలు కాకుండా మిగతా 14 సెలవులు అన్ని ప్రాంతాల బ్యాంకులకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరుపుకొనే పండగలని దృష్టిలో ఉంచుకొని RBI ఈ సెలవులని ప్రకటించింది. RBI రిలీజ్ చేసిన సెలవుల లిస్టు ప్రకారం అక్టోబర్ నెలలో కేవలం కోల్‌కతా, అగర్తల ప్రాంతంలోని బ్యాంకులు మాత్రమే సాధారణ సెలవులు కాకుండా గరిష్టంగా ఏడు (7) రోజులు సెలవలు తీసుకోనున్నాయి. జైపూర్, పానాజీ, షిమ్లా, ఐజ్వాల్  రీజినల్ బ్యాంకులు మాత్రం అక్టోబర్ నెలలో సాధారణ సెలవుల కాకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సెలవులు తీసుకోనున్నట్టు తెలిసింది. RBI సెలవుల లిస్టులో ఏ ఒక్క ప్రాంతంలో కూడా అక్టోబర్ నెలలో 21 రోజులు సెలవులు లేవు.

‘స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఒడిశా’ (SLBC) రిలీజ్ చేసిన  ‘List of Holidays for Banks Financial Institutions for 2021’ డాక్యుమెంట్లో, ఒడిశా రీజినల్ ఆఫీస్ బ్యాంకులు అక్టోబర్ నెలలో సాధారణ సెలవులు కాకుండా మూడు రోజులు సెలవలు తీసుకోబోతున్నట్టు ప్ర్రకటించింది. గాంధీ జయంతి, మహా అష్టమి, విజయ దశమి పండుగల సందర్భంగా 02, 13 మరియు 15 అక్టోబర్ 2021 రోజులు ఒడిశా రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవులు ఉండనున్నట్టు ఈ డాకుమెంట్లో SLBC ప్రకటించింది. ‘ICICI’ బ్యాంక్ సెలవుల లిస్టులో కూడా అక్టోబర్ నెలలో ఏ ఒక్క రీజినల్ బ్యాంకులకు 21 రోజుల సెలవులు ప్రకటించలేదు. ఈ వివరాల ఆధారంగా అక్టోబర్ నెలలో బ్యాంకులు 21 రోజులు తీసుకోవట్లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, RBI రిలీజ్ చేసిన సెలవుల లిస్టు ప్రకారం అక్టోబర్ నెలలో బ్యాంకులు 21 రోజులు సెలవులు తీసుకోవట్లేదు. 

Share.

About Author

Comments are closed.

scroll