Fake News, Telugu
 

హైదరాబాద్‌లో ఇస్లామిక్ జెండాలు పెట్టిన దృశ్యాలని చెప్తూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తీసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక చెరువు పక్కన ఉన్న రోడ్డుకు ఉన్న పొల్స్‌కు, మరో రోడ్డులో ఉన్న పొల్స్‌కు ఇస్లామిక్ జెండాలు పెట్టి ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ‘హిందువులు ఒక బ్యానర్ వేసుకున్న కటౌట్ వేసుకున్న ఆగా మేఘాలమీద తీసేసే GHMC ఇప్పుడు ఏ గుడ్డి గాడిద పళ్ళు తోముతుందీ’ అని చెప్తూ, ఈ వీడియో హైదరాబాద్‌లో తీసింది అని చెప్తూ యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  హైదరాబాద్‌లోని ఒక రోడ్డు పక్కన ఉన్న పొల్స్‌కు, ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇస్లామిక్ జెండాలను పెట్టారు.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోకి హైదరాబాద్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తీసిన వీడియో. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా మాకు ఈ వీడియో గురించి ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. అలాగే ఇందులో ఉన్న కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. దీని ద్వారా కూడా మాకు ఈ వీడియో గురించి ఎటువంటి వివరాలు తెలియలేదు.

వైరల్ వీడియోను సరిగ్గా చూడగా, అందులో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఒక కారు యొక్క నెంబర్ ప్లేట్ పైన ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ మాకు కనిపించింది. అది CG0 _P 23521, CG అనేది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్

దీన్ని ఆధారంగా తీసుకొని, ఛత్తీస్‌గఢ్‌లోని చెరువుల పక్కన ఉన్న రోడ్ల స్ట్రీట్ వ్యూలను మేము గూగుల్ మ్యాప్స్‌లో చూసాము. ఇలా వెతుకుతుండగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉందని మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ). వీడియోలో కనిపిస్తున్న చెరువు పేరు వివేకానంద సరోవర్. వైరల్ వీడియోలో ఒక చోట మనకు కనిపిస్తున్న కొన్ని కార్లను కూడా మనం ఈ ప్రదేశం యొక్క  స్ట్రీట్ వ్యూలలో చూడవచ్చు. ఈ కింది ఫోటోలలో, వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం, రాయ్‌పూర్‌లో ఉన్న వివేకానంద సరోవర్ పక్కన ఉన్న రోడ్డు ఒకటే అనే విషయం గమనించవచ్చు.

ఇది రాయ్‌పూర్‌లో తీసిన వీడియో అని తెలిసాక, తగిన కీవర్డ్స్ ఉపయోగించి మేము ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియో మాకు ‘Satish Rai’ అనే వ్యక్తి యొక్క ఫేస్‌బుక్ పేజీలో దొరికింది (ఆర్కైవ్ లింక్) . ‘Islamic extremists flag #Raipur’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని తను షేర్ చేశాడు. ఇది వైరల్ వీడియో కంటే మంచి క్వాలిటీ వీడియో.  అలాగే, తను ఈ వీడియో కింద తను రాయ్‌పూర్‌ మేయర్‌కి రాసిన ఒక లేఖ యొక్క ఫోటో పెట్టాడు. ఇందులో అతను పబ్లిక్ ప్రదేశాల్లో ఇలా మతపరమైన జెండాలు పెట్టడం పై తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తు వాటిని తీసివేయాల్సిందిగా రాయ్‌పూర్‌ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోరాడు.

దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మేము సతీష్‌ని ఫోన్ ద్వారా సంప్రదించగా, ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం రాయ్‌పూర్‌లోని వివేకానంద సరోవర్ లేదా బుడా తాలాబ్ అని మాకు చెప్పాడు. ఈ వీడియో తనకు ఎవరో ఫార్వార్డ్ చేస్తే తను ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడని, అలాగే ఆ జెండాలను అధికారులు ఇప్పుడు తొలగించేశారని ఆయన మాకు చెప్పాడు. ఈ ఆధారాల బట్టి, ఈ వీడియోకు హైదరాబాద్‌కి ఎటువంటి సంబంధం లేదని మనకు స్పష్టం అవుతుంది. 

చివరగా, హైదరాబాద్‌లో ఇస్లామిక్ జెండాలు పెట్టిన దృశ్యాలని చెప్తూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తీసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll