Fake News, Telugu
 

ఒక వియత్నామీస్ అమ్మాయి తన సోదరితో ఉన్న వీడియోను, ఇండోనేషియాకు చెందిన 12 ఏళ్ల గర్భవతి అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

11 ఏళ్ల పాప…. తనే ఆటాడుకుంటూ అల్లారుముద్దుగా పెరిగే వయసులో మరోపాపకు జన్మనిచ్చింది…. ఇదండీ ఇస్లాం స్వీకరించిన ఇండోనేషియా దేశంలోన్న పాప పరిస్థితి’ అని చెప్తూ, ఒక ఆసుపత్రి మంచంపై ఒక చిన్న పాప పడుకొని ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాప పైన ఒక చిన్న శిశువు ఉండటం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఈ వీడియోలో కనిపిస్తున్న 11 ఏళ్ళ చిన్న పాప, మరో పాపకు జన్మనిచ్చింది, ఇది ఇస్లాం స్వీకరించిన ఇండోనేషియా దేశంలో జరిగింది.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోను మొదటగా టిక్‌టాక్‌లో బావో న్గోక్ అనే వియత్నామీస్ మహిళ షేర్ చేసింది. ఆమె వీడియోలోని పాప తన కూతురేనని, ఆ చిన్న శిశువు యొక్క తల్లి కాదని స్పష్టం చేసింది. ఈ క్లిప్‌లో ఆమె ఇద్దరు ప్రీమెచ్యూర్ బేబీస్ (నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు) ఉన్నారని, వీడియోలోని పెద్ద పాప/బాలిక ఆ శిశువు సోదరి అని, ఆమె తల్లి కాదని బావో న్గోక్ ఒక టిక్‌టాక్‌ వీడియో ద్వారా స్పష్టం చేసింది.  కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ముందుగా, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తనిఖీ చేయడానికి, వైరల్ వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి మేము ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను చేసాము. ఈ సెర్చ్ ద్వారా, ఇదే వీడియో ఉన్న ఆగస్టు 2024నాటి ఒక టిక్‌టాక్ పోస్ట్‌కు మాకు దొరికింది.

దీనిని బావో న్గోక్ అనే వియత్నామ్ దేశానికి చెందిన మహిళ అప్‌లోడ్ చేశారు. ఆమె తన ప్రొఫైల్‌లో తను “700 గ్రా మరియు 900 గ్రా బరువున్న ఇద్దరు ప్రీమెచ్యూర్ బేబీల తల్లి” అని తన గురించి పేర్కొన్నారు.

వియత్నామీస్‌లో ఉన్న ఈ వీడియో వివరణను తెలుగులోకి అనువాదం చేసుకొని చూస్తే, వీడియోలో ఉన్న ఇద్దరు పిల్లలు అక్కా చెల్లెలు అని మాకు అర్థం అయ్యింది.  వీడియోలో కనిపిస్తున్న చిన్న పాప, ఇంకా ఆ శిశువు, టిక్‌టాక్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసిన బావో న్గోక్ పిల్లలే ఈ వివరణ సూచిస్తుంది.

ఈ క్లిప్ తప్పుడు వివరాలతో వైరల్ అయిన తర్వాత, ఆమె 11 ఆగస్టు 2024న ఒక వీడియో పోస్ట్ చేసి ఒక వివరణ ఇచ్చారు. ఈ వివరణ వీడియోలో తను మాట్లాడుతున్న విషయాన్ని Google యొక్క నోట్‌బుక్ LLM ద్వారా ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసుకొని మేము చదివాము.

ఆమె ఈ వివరణలో, ఈ ఇద్దరు పిల్లలు అక్కాచెల్లెళ్లు అని, క్లిప్‌లో కనిపిస్తున్న చిన్న అమ్మాయి తన 4 సంవత్సరాల కుమార్తె అని, ఆమె బరువు కేవలం 12 కిలోగ్రాములు మాత్రమే అని బావో న్గోక్ చెప్పింది. ఇంత చిన్న బాలిక మరో చిన్న బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యమని, ఇది నిజమైతే, ప్రపంచ వార్తలలో ఈ విషయాన్ని రిపోర్ట్ చేసేవారని, ఆమె నొక్కి చెప్పింది. 

కాబట్టి, వైరల్ వీడియోను దాని అసలు సందర్భం నుంచి వేరు చేసి ఇండోనేషియా దేశానికి  ముడిపెడుతూ తప్పుడు మతపరమైన క్లెయిములు చేస్తున్నారని మనో దీనిబట్టి మనకు స్పష్టం అవుతుంది. 

బావో న్గోక్ టిక్‌టాక్‌లో తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన చాలా వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తను పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకరినొకరు ప్రేమిస్తారు’ అని అర్థం ఉన్న వియత్నామీస్ క్యాప్షన్ ఉంది. ఇంకా, ఈ విషయం గురించి ఆమె కామెంట్ కోసం ఫ్యాక్ట్‌లీ బావో న్గోక్‌ను సంప్రదించింది, ఆమె స్పందించిన తర్వాత ఈ కథనం అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, వైరల్ వీడియోలో ఉన్నది గర్భవతి అయిన ఒక 11 ఏళ్ల ఇండోనేషియన్ అమ్మాయి కాదు, ఇందులో ఉన్న ఇద్దరి పిల్లలూ ఒక వియత్నామీస్ మహిళ యొక్క పిల్లలు, వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు.

Share.

About Author

Comments are closed.

scroll