Fake News, Telugu
 

ఇటీవల కశ్మీర్‌లో దొరికిన ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదుల దృశ్యాలని చెప్తూ సిరియాకు చెందిన ఒక పాత వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌, కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసిన తర్వాత జమ్మూ & కశ్మీర్‌లో భద్రతా దళాలుచే పెద్ద ఎత్తున సెర్చ్ కార్యకలాపాలు (ఇక్కడ, ఇక్కడ) ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, ‘కశ్మీర్ కొండల్లో, కోనల్లో, కొమ్మచాటుల్లో.. ఇద్దరు పాపిస్తానీ ఉగ్రవాదులు అవుట్..’ అని క్లెయిమ్ చేస్తూ, ఇద్దరు వ్యక్తులు ఒక కొండ ప్రాంతంలో పరిగెత్తుతున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కశ్మీర్‌లోని భద్రతా దళాల నుండి పారిపోతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్లు అనే వాదనతో ఈ క్లిప్ షేర్ చేయబడింది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కశ్మీర్‌లోని కొండల్లో ఒక అడవి గుండా పారిపోతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ఈ వీడియో చూపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో నిజానికి సిరియాకు చెందినది. ఇటీవల (మే 2025) జరిగిన భారత్-పాక్ ఘర్షణలకు ముదు, అనగా మార్చి 2025 నుండి ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఉంది. దీనికి, కశ్మీర్ లేదా పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదు. కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, మేము అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా TRHaber అనే టర్కిష్ మీడియా సంస్థ, ఇదే వీడియోని 9 మార్చి 2025న ‘X’లో పోస్ట్ చేశారని తెలిసింది. టర్కిష్ భాషలో ఉన్న ఈ పోస్ట్ యొక్క వివరణను తెలుగులోకి అనువదించినప్పుడు, దీని అర్థం: “సిరియన్ భద్రతా దళాలు లటాకియాలోని ఖార్దాహాలో గద్దె దించబడిన ప్రభుత్వ శక్తుల దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది మృతదేహాలను చేరుకున్నాయి.”

అదనంగా, ఈ వీడియో సిరియాలో తీసింది అని పేర్కొంటూ, దాదాపు అదే తేదీ నాటి అనేక ఇతర ఫేస్‌బుక్ పోస్ట్‌లను (ఇక్కడ, ఇక్కడ) కూడా మేము ఈ సెర్చ్ ద్వారా కనుగొన్నాము. దీని బట్టి, ఈ వీడియోలోని సంఘటన ఏప్రిల్ 2025 పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇటీవల(మే 2025) జరిగిన భారత్-పాక్ ఘర్షణకు ముందు జరిగిన సంఘటనను చూపిస్తుందని మనకు స్పష్టం అవుతుంది.

దీని గురించి మరిన్ని వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా ఈ సంఘటనకు సంబంధించి మాకు కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). టర్కిష్ మీడియా సంస్థ TRHaber 09 మార్చి 2025న ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం వైరల్ వీడియో సిరియాకు చెందినది అని, భారతదేశం-పాకిస్తాన్ ఘర్షణలకు సంబంధించినది కాదని మాకు తెలిసింది.

ఈ వీడియోలోని దృశ్యాలు సిరియా ప్రభుత్వ భద్రతా దళాలు, గద్దె దించబడిన అస్సాద్ పాలన శక్తుల మధ్య లటాకియాలో జరిగిన ఘర్షణలకు చెందినవి. వార్తా కథనాల ప్రకారం అస్సాద్ వర్గం వారు ఆస్పత్రులు, సైనిక స్థావరాలపై దాడి చేశారు, ఇది ఒక పెద్ద కౌంటర్-ఆపరేషన్‌కు దారితీసింది. ఇందులో 200 మందికి పైగా సిరియన్ భద్రతా సిబ్బంది మరణించారు.

చివరగా, సిరియాలోని ఒక అడవిలో ఇద్దరు వ్యక్తులు పరిగెడుతున్న వీడియోను కశ్మీర్ పరిగెడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll